వేములవాడ, వెలుగు: డ్రైనేజీ వాటర్ చేరుతుండడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి గుడి చెరువు మురుగు కూపంగా మారుతోంది. డ్రైనేజీ వాటర్ చెరువులోకి వెళ్లకుండా పనులు చేపట్టేందుకు రూ.33 కోట్లతో ప్రతిపాదనలు రెడీ చేసి ఏండ్లు గడుస్తున్నా నేటికీ కార్యరూపం దాల్చలేదు. రాజన్న గుడిని ఆనుకుని చెరువు ఉండడంతో ధర్మగుండంతో పాటు చెరువులో భక్తులు స్నానాలు చేస్తారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి ఆలయ ధర్మగుండంతో పాటు గుడి చెరువులో కూడా స్నానాల ఘాట్ నిర్మాణానికి రూప కల్పన చేశారు. టెంపుల్ చెరువులో సంవత్సరం పొడవునా నీరు ఉండే విధంగా మిడ్ మానేరు నీటిని లిఫ్ట్ద్వారా నింపుతున్నారు. అయితే భీమేశ్వర కాలువ వెంబడి, న్యూ అర్బన్ కాలనీతో పాటు భగవంతరావునగర్ ప్రాంతం, వీఐపీ రోడ్డు నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్ గుడి చెరువులోకి చేరుతుండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ వాటర్ గుడి చెరువులోకి వెళ్లకుండా శాశ్వత పరిష్కారం కోసం సంకెపల్లి ప్రాంతానికి తరలించేందుకు రూ. 33 కోట్లతో అండర్ డ్రైనేజీ కాలువ నిర్మాణానికి మున్సిపల్ అధికారులు రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ నేటికీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తాం
డ్రైనేజీ వాటర్ గుడి చెరువులోకి వెళ్లకుండా శాశ్వత పరిష్కారం కోసం రూ. 33 కోట్లతో అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం ఆరు నెలల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు త్వరలో వచ్చే అవకాశం ఉంది. వేములవాడ డ్రైనేజీ నీరు చెరువులో కలవకుండా చర్యలు తీసుకుంటాం. పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తాం.
-అన్వేష్, మున్సిపల్ కమిషనర్, వేములవాడ