శివాలయాల్లో ‘కార్తీక’ సందడి

శివాలయాల్లో ‘కార్తీక’ సందడి
  • శివనామస్మరణతో మార్మోగిన ఎములాడ, కొమురవెల్లి
  • యాదగిరిగుట్టలో ఒక్కరోజే 783 సత్యనారాయణస్వామి వ్రతాలు

వేములవాడ/కొమురవెల్లి, వెలుగు : వేములవాడ రాజన్న, కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసంతో పాటు, ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. వేములవాడలో ధర్మదర్శనానికి 5 గంటల టైం పట్టిందని భక్తులు తెలిపారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించి, కార్తీక దీపాలు వెలిగించారు. కొమురవెల్లిలో గంగిరెగి చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. 

గుట్టలో భారీ సంఖ్యలో వ్రతాల నిర్వహణ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట ఆలయంలో ఆదివారం భారీ సంఖ్యలో సత్యనారాయణస్వామి వ్రతాలు జరిగాయి. ఒక్కరోజే 783 మంది వ్రతాలు జరిపించుకోగా వీటి ద్వారా రూ.6,26,400 ఆదాయం వచ్చింది. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో వ్రతమండపాలు కిటకిటలాడాయి. మరో వైపు ఆలయ పరిసరాల్లో ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట టైం పట్టిందని భక్తులు తెలిపారు.