
- ఆన్లైన్ లో టెండర్లు వేసిన తమిళనాడుకు చెందిన సంస్థలు
- బహిరంగ వేలానికి హాజరైనా పాల్గొనని ఇద్దరు కాంట్రాక్టర్లు
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయం లో తలనీలాలకు టెండర్ధర ఆశించిన స్థాయిలో రాలేదు. శుక్రవారం ఆలయంలో వేలం పాటు వేశారు. గత రెండేండ్ల కింద టెండర్లో రూ. 19 కోట్ల వరకు పలికింది. ఈసారి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. పాత పాటతో ప్రారంభించగా బహిరంగ వేలంలో రూ. 50 లక్షల డీడీలు చెల్లించిన సికింద్రాబాద్ కు చెందిన నాగకుమారి ఎంటర్ ప్రైజెస్, కళావతి ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకులు హాజరైనా పాటలో పాల్గొనలేదు.
కాగా.. తమిళనాడుకు చెందిన కేఎమ్హెయిర్ ఇంటర్నేషనల్ సంస్థ రూ. 12 . 75 కోట్లు, దురై ఎంటర్ ప్రైజెస్ సంస్థ రూ. 13. 67 కోట్లకు ఆన్ లైన్ టెండర్లు వేశాయి. ఆలయ పాటకు కాంట్రాక్టర్లు పాటకు మధ్య రూ. 6 కోట్ల తేడా ఉండడంతో నిలిపివేసి.. దేవాదాయ కమిషనర్ కు నివేదిక పంపినట్లు ఆలయ ఈఓ వినోద్‌రెడ్డి తెలిపారు. విదేశాల్లో ధరలు తగ్గడం, అలయ అభివృద్ధి పనులు ప్రారంభమైతే భక్తుల సంఖ్య తగ్గే చాన్స్ ఉందనే భయంతోనే టెండర్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదని తెలిసింది.
పాత బకాయిలే రూ. 3.50 కోట్లు
రెండేండ్ల కింద ఏపీలోని హిందుపురానికి చెందిన సుమితి ఎంటర్ప్రైజెస్ రూ. 19.8 కోట్లకు టెండర్ దక్కించుకుంది. ఈనెల11న పాత కాంట్రాక్టర్గడువు ముగిసింది. ఇంకా రూ. 3 .50 కోట్లు చెల్లించాలి. కాగా.. కాంట్రాక్టర్‌కు వచ్చే డిసెంబర్ 25 వరకు వెసులుబాటు కల్పించడంపై విమర్శలు వస్తున్నాయి.
ఆలయ నిర్వహణలోనే కల్యాణ కట్ట
శుక్రవారం నుంచి పాత కాంట్రాక్టర్గడువు ముగియడంతో పాటు కొత్త కాంట్రాక్ట్ కు ఇంకా ఎవరికి ఇవ్వకపోవడంతో శనివారం నుంచి కల్యాణకట్ట ఆలయ నిర్వహణ పరిధిలోనే ఉంటుందని అధికారులు తెలిపారు. ఆలయ సేవాదారులు, సూపర్ వైజర్లు, పర్యవేక్షకులు నిర్వహణ చూస్తారన్నారు.