
- ఈ నెల15న తుది ప్రణాళిక రెడీ.. 21న టెండర్ల ప్రక్రియ
- జులై నుంచి విస్తరణ పనులు
- రివ్యూ మీటింగ్‌లో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల15కల్లా పనులకు సంబంధించిన మార్పుచేర్పులతో తుది ప్రణాళిక రెడీ చేసి, 21న టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధ్యక్షతన మంగళవారం సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్, ఓఎస్డీ సోమరాజు హాజరయ్యారు.
ఆలయ విస్తరణ పనులకు సంబంధించిన ఆర్కిటెక్ట్ రూపొందించిన నమూనాను పరిశీలించారు. కొన్ని మార్పులు, చేర్పులు చేసి రెండు రోజుల్లోగా తుది ప్లాన్ రెడీ చేయాలని ఆర్కిటెక్ట్ ను అధికారులు ఆదేశించారు. ఈ పనుల కోసం ఆర్అండ్బీ, దేవాదాయ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ ఈ నెల 15న ఎండోమెంట్ కమిషనర్‌తో కలిసి వేములవాడ ఆలయాన్ని సందర్శించనుంది. ఇప్పటికే వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి రెడీ చేసిన మాస్టర్ ప్లాన్‌ను ఈ అధికారుల బృందం పరిశీలించింది. ఈ క్రమంలోనే ఈ నెల 21న టెండర్లు పిలిచేందుకు ఆర్అండ్ బీ అధికారులు సిద్ధమయ్యారు.
భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
జూన్ 15 నుంచి భీమేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు, అభిషేకాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జూన్ 10 లోగా భీమేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లను అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు.
వేద పాఠశాల ముందు ఉన్న స్థలంలో శృంగేరీ శంకర మఠం ఖాళీ స్థలంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అభిషేకాలు, నిత్యకల్యాణం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను ఆయన ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.