రాజన్నకు సిరులు కురిపించిన కురులు

రాజన్నకు సిరులు కురిపించిన కురులు

రూ. 19 కోట్లకు తలనీలాల టెండర్​

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం తలనీలాల టెండర్​రూ. 19 కోట్లు పలికింది. మంగళవారం ఆలయ ఓపెన్​ స్లాబ్​ లో 2023–‌‌‌‌-25 సంవత్సరాలకు తలనీలాలు పోగు చేసుకునే టెండర్ ఈవో కృష్ణ ప్రసాద్​ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతపురం జిల్లా హిందూపురం సుమిత్ ఎంటర్ ప్రైజెస్​కు చెందిన నాగరాజు రూ. 19 కోట్ల 8 వేలకు సీల్డ్​టెండర్ ద్వారా దక్కించుకున్నారు. 2021–-23లో రూ. 9 కోట్ల ఒక లక్ష ఉన్న టెండర్ ఈసారి పోటీ ఎక్కువ కావడంతో ఏకంగా 10 కోట్ల వరకు పెరిగింది.

బాక్స్​లో ఏడుగురు టెండర్లు వేయగా, ఓపెన్​టెండర్​లో 11 మంది పాల్గొన్నారు. బహిరంగ వేలంలో కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కేవీ ఎంటర్​ప్రైజెస్​రామాంజనేయులు రూ. 16 కోట్ల 86 లక్షల వరకు పాడారు. అయితే సీల్డ్​టెండర్​లో ఏకంగా రూ.19 కోట్ల 8 వేలు ఉండడంతో అంతా అవాక్కయ్యారు. తమిళనాడుకు చెందిన శివగంగ ముత్తు మోహన్​దాసు రూ. 18 కోట్ల 57 లక్షల 55 వేలకు సీల్డ్​టెండర్​వేయడం గమనార్హం.