వేములవాడ రాజన్న ఆలయంలో రాముడి లగ్గం

వేములవాడ రాజన్న ఆలయంలో  రాముడి లగ్గం
  • వేములవాడలో ఘనంగా సీతారాముల కల్యాణం
  • భారీ సంఖ్యలో హాజరైన భక్తులు
  • యాదగిరిగుట్ట, కొండగట్టులో కనులపండువగా వేడుకలు

వేములవాడ, వెలుగు : సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ గెస్ట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ ఎదురుగా ఏర్పాటు చేసిన కల్యాణవేదికపై జగదభిరాముడి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, రాజన్న ఆలయం తరఫున ఈవో వినోద్‌‌‌‌‌‌‌‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. మున్సిపాలిటీ తరఫున కమిషనర్‌‌‌‌‌‌‌‌ అన్వేష్‌‌‌‌‌‌‌‌, కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ తరఫున బీజేపీ లీడర్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు. 

కన్యాదాతలుగా రాచకొండ భాను కాంతి దంపతులు వ్యవహరించారు. ప్రధాన అర్చకుడు శరత్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి  మధ్యాహ్నం 1 గంట మధ్య సీతారాముల కల్యాణమహోత్సవాన్ని జరిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ తండ్రి పొన్నం సత్తయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌ ఛారిటబుల్‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. 

ఎలాంటి ఘటనలు జరగకుండా ఎస్పీ మహేశ్‌‌‌‌‌‌‌‌ గీతే, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి అధ్వర్యంలో సీఐలు వీరప్రసాద్‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, యాదగిరి, మధుకర్‌‌‌‌‌‌‌‌లు బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్యాణంలో మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రొండి రాజు, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, బింగి మహేశ్‌‌‌‌‌‌‌‌, ఏనుగు మనోహర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం పట్టణ వీధుల్లో స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు. 

హిజ్రాలు, జోగినుల సందడి

వేములవాడలో జరిగిన సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు జోగినులు, హిజ్రాలు, శివపార్వతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఓ వైపు సీతారాముల కల్యాణం జరుగుతుండగా.. మరో వైపు జోగినులు, హిజ్రాలు ఒకరి మెడలో మరొకరు తాళి కట్టుకొని, తలంబ్రాలు పోసుకున్నారు. 

యాదగిరిగుట్ట, కొండగట్టులో...

యాదగిరిగుట్ట/కొండగట్టు, వెలుగు : యాదగిరిగుట్ట అనుబంధమైన రామలింగేశ్వరస్వామి ఆలయంతో పాటు జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట శివాలయంలో ఉదయం పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు సీతారాముల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. తర్వాత కల్యాణ మండపంలో అధిష్టింపజేసి మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

యాదగిరిగుట్ట ఆలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నరసింహమూర్తి దంపతులు, ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు స్వామివారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు దంపతులు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కరశర్మ, పర్యవేక్షకులు రాజన్‌‌‌‌‌‌‌‌బాబు, శివాలయ ప్రధానార్చకులు గౌరీభట్ల నరసింహరాములు, పురోహితులు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌శర్మ, సత్యనారాయణశర్మ పాల్గొన్నారు.

అలాగే కొండగట్టులో జరిగిన సీతారాముల కల్యాణానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీతారాముల కల్యాణ ముచ్చట్లను స్థానాచార్యులు కపిందర్‌‌‌‌‌‌‌‌ వివరించారు. ఈవో శ్రీకాంత్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, జితేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌, ఉప ప్రధానఅర్చకుడు చిరంజీవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు