
- నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు
- 4 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా
- 778 ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
వేములవాడ, వెలుగు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26న మహాశివరాత్రి రోజున జరిగే జాతర కోసం తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పిస్తున్నారు.
పనులను పర్యవేక్షిస్తున్న ఆఫీసర్లు
మహాశివరాత్రి జాతర సందర్భంగా రాజన్న ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ధర్మగుండాన్ని శుద్ధి చేసి కొత్త నీటిని నింపడంతో పాటు ఆలయ పరిసరాలను క్లీన్ చేశారు. వేములవాడ పట్టణం పూర్తిగా ఆధ్యాత్మికత నిండుకునేలా ఫ్లెక్సీలను కట్టడంతో పాటు పట్టణం నలువైపులా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా వసతి గదులు, చలువ పందిళ్లు, రవాణా, తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు.
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం రాజన్న గుడి చెరువు మైదానంలో శివర్చాన స్టేజీని సిద్ధం చేశారు. అలాగే భక్తులకు పంపిణీ చేసేందుకు ఐదు లక్షల లడ్డూలను సిద్ధం చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపారు. వేములవాడకు వచ్చేఅన్ని దారుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రాజన్న సన్నిధికి భక్తులు ఈజీగా చేరుకునేలా సూచిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. వేములవాడలో జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమర్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఈవో కృష్ణ ప్రపాద్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
778 ఆర్టీసీ బస్సులు
వేములవాడలో జరిగే మహాశివరాత్రి జాతర కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. వరంగల్, కోరుట్ల, మెట్‌పల్లి, అర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, నర్సంపేట, హనుమకొండ, హైదరాబాద్, సిరిసిల్ల, హుజూరాబాద్ రూట్లలో మొత్తం 778 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు 24 గంటల పాటు ఫ్రీగా 14 మినీ బస్సులను నడుపుతున్నామని డిపో మేనేజర్ బోనాల శ్రీనివాస్ తెలిపారు.
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి : ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్
మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో రాజన్న దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.