వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక:  ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ నమూనాలను పరిశీలించి,ఆలయ అభివృద్ది పనులపై కలెక్టర్  సందీప్ కుమార్ ఝా, ఆలయ అధికారులతో కలిసి శనివారం ఆలయ ఈఓ గెస్ట్ హౌస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

 
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు స్వామివారి దర్శనం వేగంగా కల్పించేందుకు, మెరుగైన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఆలయ అభివృద్ధి పనులను శృంగేరి పీఠం, పండితులు, భక్తుల సూచనల మేరకు చేపట్టి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.శృంగేరి పీఠాధిపతి సూచనలు, సలహా మేరకు  అభివృద్ది చేస్తామన్నారు.  భక్తులకు వేగంగా దర్శనం,మంచి వసతి,ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని తెలిపారు.  ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ విస్తరణ పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు.  ఆలయ పరిసరాల్లో నిర్మాణాల పై గతంలో ఇచ్చిన GO నెంబరు 149 రద్దు పై చర్చించారు. 

గతంలో శృంగేరి పీఠన్ని సందర్శించినపుడు ఆలయ విస్తరణ నమూనాతో రావాలని వారు తెలిపారని విప్ గుర్తు చేశారు.ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.. ఈ క్రమంలో త్వరలో శృంగేరి పీఠన్ని సందర్శించి ఆలయ విస్తరణ పై నమూనాలను శృంగేరి పీఠాధిపతి ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామివారిని కలిసి వారి సూచనలు సలహాల ప్రకారం ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విస్తరణ చేపడుతామని ప్రభుత్వ విప్ స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత ఉట్టి పడేలా ఆలయాన్ని విస్తరిస్తామని తెలిపారు..

జీవో నంబర్ 149 రద్దు పై చర్చ

గత ప్రభుత్వ హయంలో వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలలో నూతనంగా 1000 మీటర్ల (కిలో మీటర్ ) పరిధిలో చేపట్టబోయి నిర్మాణాలపై ఇచ్చిన జీవో నెంబర్ 149 రద్దుపై చర్చించారు.. ఈ జీవో వలన పట్టణంలో ఆలయం పరిసరాల్లో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు..  జీవో నంబర్ 149 రద్దుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు..