- ఇటీవల రూ.75కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం
- మిడ్‌మానేరులో బోటింగ్, అనంతగిరి గుట్టలపై ఐలాండ్ ఏర్పాటు దిశగా కసరత్తు
- మానేరు, వేములవాడ టెంపుల్ అభివృద్ధిని పదేండ్లుగా పట్టించుకోలే
- మిడ్‌మానేరులో బోటింగ్ ముణ్నాళ్ల ముచ్చటే అయింది
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్లలో టెంపుల్ టూరిజంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. వేములవాడ రాజన్న ఆలయంతోపాటు మిడ్‌మానేరును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు సిద్ధం చేశారు. సిరిసిల్ల పట్టణాన్ని ఆనుకొని ఉన్న మానేరును పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్న గత ప్రభుత్వ నిర్ణయం ప్రతిపాదనలకే పరిమితమైంది. రూ.వేల కోట్లతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి హోదాలో కేటీఆర్ హామీ ఇచ్చారు. పదేండ్లు అధికారంలో ఉన్నా ఆ ప్రతిపాదనలు పట్టాలెక్కలేదు.
మిడ్‌మానేరులో ఏర్పాటు చేసిన బోటింగ్ ముణ్నాళ్ల ముచ్చటే అయింది. రెండు నెలల కింద వేములవాడ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి రాజన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రూ. 75 కోట్లతో టెంపుల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రతిపాదనలకే పరిమితమైన మానేరు అభివృద్ధి
గత ప్రభుత్వ హయాంలో మానేరును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నాటి సర్కార్ అధికారులను ఆదేశించారు. ఆఫీసర్లు సర్వే జరిపి ప్రతిపాదనలు సిద్ధం చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. సిరిసిల్ల పట్టణాన్ని ఆనుకుని ఉన్న తంగళ్లపల్లి బ్రిడ్జి నుంచి రూ.30 కోట్లతో కరకట్ట నిర్మించారు. ఈ కరకట్ట దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉంది. మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్‌లో ఈ కరకట్ట పొడవునా రామప్ప గుట్టల వరకు బోటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
మిడ్‌మానేరులో రెండు నెలలు తిప్పినా పర్యాటక బోటు ఆ తర్వాత మూలన పడింది. దీంతోపాటు కరకట్టపై పార్క్‌లు, సైకిల్ ట్రాక్ , చిన్నారులకు ఆట స్థలాలు, ఫౌంటేన్లు, ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసింది. మిడ్‌మానేరుతోపాటు అన్నపూర్ణ అనంతగిరి ప్రాజెక్ట్ మధ్య ఉన్న గుట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సి ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు.
టూరిజంపై సర్కార్ ఫోకస్
రాజన్నసిరిసిల్ల జిల్లాలో వేములవాడ రాజన్న ఆలయం కేంద్రంగా టూరిజం డెవలప్చేయడంపై కాంగ్రెస్ సర్కార్దృష్టి పెట్టింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టెంపుల్అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.50కోట్లు పెట్టింది. విప్ఆది శ్రీనివాస్ రాజన్న జిల్లాలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. రెండు నెలల కింద వేములవాడలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి రాజన్నజిల్లాకు మరో రూ.75 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ALSO READ : పాలమూరు మెయిన్ కెనాల్ కు హైవే కష్టాలు!
దీంతో వేములవాడ ఆలయం, రోడ్ల విస్తరణ, మూలవాగు బ్రిడ్జిపై ట్రాఫిక్‌నియంత్రణ.. వంటి పనులు చేపట్టనున్నారు. మిడ్ మానేరు బ్యాక్ వాటర్‌లో రామప్ప గుట్టల నుంచి అన్నపూర్ణ ప్రాజెక్ట్ వరకు, ఇల్లంతకుంట గుట్టలను అనంతగిరి ఐలాండ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే వేములవాడకు వచ్చే భక్తులకుఆహ్లాదం పంచుతుందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.