మహాశివరాత్రికి ఎములాడ రెడీ

  • మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా
  • నేటి నుంచి 3 రోజుల పాటు జాతర
  • ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

వేములవాడ, వెలుగు : మహాశివరాత్రి జాతరకు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబైంది. గురువారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి సుమారు 3 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ఆఫీసర్లు అంచనా వేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం రాజన్న గుడి చెరువు మైదానంలో స్టేజీని రెడీ చేశారు.

కనీస వసతులపై ప్రత్యేక దృష్టి

వేములవాడకు వచ్చే భక్తులకు కల్పించే వసతులు, భద్రతాఏర్పాట్లపై కలెక్టర్ అనురాగ్​జయంతి, ఎస్పీ అఖిల్​మహాజన్, ఆలయ ఈవో కృష్ణ ప్రపాద్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రధానంగా వసతి గదులు, చలువ పందిళ్లు, రవాణా, తాగునీరు, శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించారు. వేములవాడ మున్సిపాలిటీతో పాటు ఆలయ ఆఫీసర్లు శానిటేషన్ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలో శానిటేషన్ నిర్వహణను మున్సిపాలిటీ, ఆలయం, ఆలయ వసతి గృహాల్లో నిర్వహణను ఆలయ ఆఫీసర్లు పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం ఇతర జిల్లాల్లొని మున్సిపల్ కార్మికులతో పాటు, తాత్కాలిక కార్మికుల సేవలను సైతం ఉపయోగించుకుంటున్నారు. 

1600 మంది పోలీసులు, 640 కెమెరాలు

మహాశివరాత్రి జాతర టైంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 1,600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 640 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. భక్తులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పోలీస్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్​రూంలో సంప్రదించాలని భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్పీ అఖిల్‌‌‌‌‌‌‌‌ మహాజన్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

ప్రత్యేకంగా వెయ్యి ఆర్టీసీ బస్సులు

మహాశివరాత్రి జాతర కోసం వెయ్యి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్, కోరుట్ల, మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, ఆర్మూర్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, నర్సంపేట, హనుమకొండ, హైదరాబాద్ రూట్లలో గురువారం 265 బస్సులు, శుక్రవారం 400, శనివారం 329 బస్సులు నడపనున్నట్లు కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జోనల్‌‌‌‌‌‌‌‌ ఈడీ వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. వేములవాడ బస్టాండ్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆలయం వరకు ఉచితంగా 14 మినీ బస్సులను నడుపుతున్నామని, ఈ బస్సులు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని చెప్పారు.

హెల్త్‌‌‌‌‌‌‌‌ సెంటర్ల ఏర్పాటు

జాతరకు వచ్చే భక్తులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగితే వెంటనే ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తిప్పాపూర్, జగిత్యాల రూట్లోని బస్టాండ్లు, నాంపల్లిగుట్ట, అమ్మవారి కాంప్లెక్స్, రాజేశ్వరపురం, ప్రధానాలయం ఎదుట, సంస్కృత కాలేజీలో అత్యవసర చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వేములవాడకు వచ్చే అన్ని రూట్లలో ప్రైమరీ హెల్త్‌‌‌‌‌‌‌‌ సెంటర్లతో పాటు, అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అంబులెన్స్, రెస్క్యూ టీం, మెడికల్ అవగాహన స్టాల్ ఏర్పాటు చేసినట్లు హెల్త్‌ ఆఫీసర్లు చెప్పారు.

టీటీడీ, ప్రభుత్వం తరఫున అందనున్న పట్టువస్త్రాలు

వేములవాడ జాతర సందర్భంగా రాజరాజేశ్వరస్వామికి అటు టీటీడీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందనున్నాయి. గురువారం రాత్రి టీటీడీ తరఫున అర్చకులు, ఆఫీసర్లు రాజన్నకు పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేయనున్నారు.