
రాజన్న సిరిసిల్ల జిల్లా: మహాశివరాత్రి జాతరలో వేములవాడ రాజన్నను 2 లక్షల 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. మహా శివరాత్రి పర్వదినాన వేములవాడ రాజన్న ఆలయానికి కోటీ 31 లక్షల 89 వేల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కోడె మొక్కుల ద్వారా 45 లక్షల 83 వేలు, ప్రసాదాల ద్వారా 57 లక్షల 12 వేల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తులకు ఐదు లక్షల లడ్డూలను పంపిణీ చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఫిబ్రవరి 26న జరిగిన మహాశివరాత్రి జాతర కోసం తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి భక్తులు తరలివచ్చారు. వేములవాడలో జరిగిన మహాశివరాత్రి జాతర కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బస్సులు నడిపారు. వరంగల్, కోరుట్ల, మెట్‌పల్లి, అర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, నర్సంపేట, హనుమకొండ, హైదరాబాద్, సిరిసిల్ల, హుజూరాబాద్ రూట్లలో మొత్తం 778 ప్రత్యేక బస్సులు నడిపారు. వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు 24 గంటల పాటు ఫ్రీగా 14 మినీ బస్సులను నడిపారు.
Also Read:-ఫిబ్రవరి 1న రూ.84,490 పలికిన తులం బంగారం ధర..
ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 15 వరకూ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ. 1 కోటి 69 లక్షలు వచ్చినట్టు ఆలయ ఈవో వినోద్ తెలిపారు. ఆలయ ఖజానాకు రూ. 1 కోటి 69 లక్షల76 వేల 867 నగదు, 116 గ్రాముల బంగారం, 9 కిలోల 800 గ్రాముల వెండి సమకూరినట్లు పేర్కొన్నారు.