వేములవాడ, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయం లో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. తమ కోరిన కోరికలు నెరవేరాలని స్వామికి ఎంతో ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించారు. ఉదయమే స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. తెల్లవారుజామునుండే పవిత్రమైన ధర్మగుండంలో భక్తులు స్నాన ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణ కట్ట, ప్రసాదం కౌంటర్లలో భక్తుల రద్దీ కొనసాగింది. స్వామిని 44,859 మంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ సభకు నిధులు మళ్లించడం అవాస్తవం
ఇటీవల వేములవాడలో నిర్వహించిన సీఎం సభకు రాజన్న ఆలయం నుంచి నిధులు సమకూర్చమని పలు పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తమని ఆలయ ఈవో వినోద్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. దేవాలయం నుంచి ఎలాంటి నిధులు ఖర్చు చేయాలన్నా దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల మేరకే ఉంటుందని ఆయన తెలిపారు. సీఎం సభలో భోజనాలకు గానీ, ఇతర అవసరాలకు గానీ నిధులు మళ్లించలేదని చెల్లించలేదని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.