హైదరాబాద్లో చికెన్ మేళా.. గంటలో 2 క్వింటాళ్ల చికెన్, 2 వేల కోడిగుడ్లను ఊదేశారు..!

హైదరాబాద్లో చికెన్ మేళా.. గంటలో 2 క్వింటాళ్ల చికెన్, 2 వేల కోడిగుడ్లను ఊదేశారు..!

రంగారెడ్డి జిల్లా: బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో మచాన్ పల్లి సొసైటీ పక్కన ఉన్న "వెన్ కాబ్ అండ్ రెడ్డి చికెన్" సెంటర్ ఆధ్వర్యంలో ఫ్రీ చికెన్ మేళా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ భయంతో జనాలు చికెన్ కొనడం తగ్గించేశారు. పౌల్ట్రీ వ్యాపారంపై ఈ ఎఫెక్ట్ చాలానే ఉంది. చికెన్ సెంటర్లు ఆదివారం రోజు కూడా కస్టమర్లు లేక వెలవెలబోతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే.. ప్రజల్లో అవగాహన కల్పించి, బర్డ్ ఫ్లూ భయాన్ని పోగొట్టి చికెన్ సేల్స్ పెంచుకోవాలని వ్యాపారులు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే.. బండ్లగూడలో ఫ్రీ చికెన్ అండ్ ఫ్రీ ఎగ్స్ మేళా నిర్వహించారు.

ఇకనైనా ఎప్పటి లాగానే చికెన్ కొనుక్కొని హాయిగా అందరూ తినాలని నిర్వాహకులు కోరారు. గత కొన్ని రోజులుగా తాము చాలా నష్టపోయామని, దయచేసి వదంతులు నమ్మడం మాని అందరూ బిందాస్గా చికెన్ తినాలని ఈ ఫ్రీ చికెన్ మేళా నిర్వాహకుడు రాజేందర్ రెడ్డి అన్నారు. ముందుగా షాప్ నిర్వాహకులు తిన్న తర్వాతనే పబ్లిక్కి వండిన చికెన్ను, కోడిగుడ్లను పంచారు. రెండు క్వింటాల చికెన్, రెండు వేల కోడిగుడ్లతో పాటు వాటర్ కూడా ఫ్రీగా పంపిణీ చేశారు. గంట లోపే జనాలు తినేశారు.

తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చికెన్ మేళాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మెదక్ పట్టణంలోని ఆటోనగర్లో ఓ చికెన్  సెంటర్ నిర్వాహకుడు శుక్రవారం (ఫిబ్రవరి 21,  2025) చికెన్, ఎగ్​మేళా నిర్వహించాడు. ఇందులో భాగంగా చికెన్, కోడిగుడ్డుతో వివిధ రకాల వంటకాలు తయారు చేసి ఫ్రీగా పంపిణీ చేశాడు. విషయం తెలుసుకున్న ప్రజలు వాటిని తినేందుకు ఎగబడ్డారు. చికెన్, గుడ్డు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదనే విషయం ప్రజలకు తెలియజేసేందుకే ఈ మేళా ఏర్పాటు చేసినట్లు చికెన్ సెంటర్ నిర్వాహకుడు చెప్పాడు. నల్గొండలో నిర్వహించిన చికెన్ మేళా కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. 300 కేజీల చికెన్ 65, 2 వేల ఎగ్స్‌‌ గంటలోనే తినేశారు.

70 డిగ్రీల సెల్సియస్ వేడిలో చికెన్ను బాగా ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఉండదని అధికారులు చెప్తున్నారు. ఉడికీ ఉడకని చికెన్, గుడ్లు తింటేనే బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందంటున్నారు. బర్డ్ ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకదని, పక్షులు, జంతువుల నుంచి మాత్రమే మనుషులకు సోకుతుందంటున్నారు. బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు, కోళ్లు చనిపోయే అవకాశం ఉంది కానీ, మనుషులపై మాత్రం ప్రభావం తక్కువే ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు.