అందాల వెనిస్​కు ఆపదొచ్చింది!

‘నీటిపై తేలియాడే నగరం’గా చెప్పుకునే ఇటలీలోని వెనిస్​ ఇప్పుడు 80 శాతానికి పైగా నీట మునిగింది. ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రాంతాల్లో ఒకటైన ఈ సిటీని 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తాయి. ఈ ముంపుతో వెనిస్​లోని ఎన్నో మ్యూజియమ్​లు, చారిత్రక కట్టడాలు నీళ్లతో నిండిపోయాయి. కళాఖండాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ నగరానికి టూరిజం విషయంలోనూ దెబ్బతగిలే ప్రమాదం పొంచి ఉంది.

ఒకప్పుడు కళలకు కేంద్రంగా నిలిచిన ఇటలీలోని వెనిస్​ ఈమధ్య కళతప్పుతోంది. వాతావరణ మార్పుల ప్రభావం నగరంపై తీవ్రంగా పడుతోంది. 20 ఏళ్లుగా సిటీని వరదలు వదలట్లేదు. లేటెస్ట్​గా వర్షాలతోపాటు సిటీ పక్కనే ఉన్న అడియాట్రిక్​ సముద్రం నుంచి వస్తున్న నీరు నగరాన్ని నిండా ముంచింది. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ప్రభుత్వం చెబుతోంది. గతంలో టూరిస్టులతో సందడిగా కనిపించిన ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎటు చూసినా ఆరడుగుల లోతులో నీళ్లే అగుపిస్తున్నాయి.

వెనిస్​ ఒక ప్రత్యేక నగరం. దీనికి ఎన్నో ముద్దు పేర్లు ఉన్నాయి. ‘సిటీ ఆఫ్​ వాటర్​’ అని, ‘సిటీ ఆఫ్​ బ్రిడ్జెస్​’ అని, ‘సిటీ ఆఫ్​ లైట్​’ అని కూడా పిలుస్తారు. ఇటలీకి ఉత్తరాన ఉన్న ఈ వెనిస్​ వందకుపైగా దీవుల సముదాయం. చూడచక్కని ప్రకృతి అందాలకు, చారిత్రక ప్రదేశాలకు ఈ నగరం నిలయం. ఇక్కడి సెయింట్​ మార్క్స్​ స్క్వేర్​, డోజ్​ ప్యాలెస్​ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. అక్కడి పబ్లిక్​ ప్లాజాని రచయితలు ‘డ్రాయింగ్​ రూమ్​ ఆఫ్​ యూరప్​’గా వర్ణిస్తారు.

వెలవెలబోతున్న ‘సెయింట్​ మార్క్స్​ స్క్వేర్’ ​

లోతట్టు ప్రాంతాల్లో సెయింట్​ మార్క్స్​ స్క్వేర్​ ఒకటి. ఈ ఏరియాని ఇప్పుడు వరదలు పెద్దఎత్తున ముంచెత్తాయి. మీటర్​కు పైగా లోతులో నీళ్లు నిలిచాయి. 1200 ఏళ్ల చరిత్ర గల బాసిలికా చర్చి ఉన్న ఈ ప్రదేశం నీట మునగటం ఇది ఆరోసారి. నీటిని తోడిపోయటానికి పంప్​లను వాడాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. సముద్రంలో ఆటుపోట్లు, వాతావరణ తుఫాన్ల వల్ల ఈశాన్య దిశలో గాలులు బలంగా వీస్తున్నాయి. చెరువుల్ని తలపిస్తున్న రోడ్లు దాటాలంటే జనం బిక్కుబిక్కుమంటున్నారు.

దీంతో ఎమర్జెన్సీ సర్వీసులను రంగంలోకి దింపారు. జనాన్ని కాపాడటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేపట్టారు. వారిని తరలించటానికి కోస్ట్​ గార్డ్​లు అదనపు పడవలను ఏర్పాటుచేశారు. ఆ పడవల్ని వాటర్​ అంబులెన్స్​ల మాదిరిగా వినియోగిస్తున్నారు. వీటికితోడు సెయింట్​ మార్క్స్​ స్క్వేర్​ ప్రాంతంలో జనం నడవటానికి వీలుగా కట్టెలతో రూపొందించిన క్యాట్​వాక్​​లను రోడ్లపై అందుబాటులో ఉంచారు.

లా ఫెనిస్​ థియేటర్​లోకి నీళ్లు

వెనిస్​లో 18వ శతాబ్ధానికి చెందిన లా ఫెనిస్​ (ది ఫోనెక్స్​) థియేటర్​ ప్రపంచంలోని మోస్ట్​ ఫేమస్​ ఒపెరా హౌజుల్లో ఒకటి. ఈ బిల్డింగ్​ చుట్టూ వరద నీరు పోటెత్తింది. ఎలక్ట్రికల్​, ఫైర్​ ప్రివెన్షన్​ సిస్టమ్స్​ ఉన్న కంట్రోల్​ రూమ్​లోకి నీళ్లు వచ్చాయి. గతంలో కూడా ఇలాగే నీళ్లు ప్రవేశించటంతో షార్ట్​ సర్క్యూట్​ వల్ల మంటలు చెలరేగాయి. అయినా ఈ భవనం వాటిని తట్టుకొని నిలబడగలిగింది.

 

 

 

గ్రిట్టి ప్యాలెస్ మొత్తం ఖాళీ​ 

వెనిస్​ నడిమధ్య నుంచి ప్రవహిస్తున్న గ్రాండ్​ కెనాల్​ చుట్టూ నిర్మించిన అనేక అందమైన, చారిత్రక హోటల్స్​లో గ్రిట్​ ప్యాలెస్​ ఒకటి. విన్​స్టన్​ చర్చిల్​, ఎర్నెస్ట్​ హెమింగ్​వే, ఎలిజబెత్​ టేలర్​, రిచర్డ్​ బర్టన్​ తదితర రాజ కుటుంబీకులు, సెలబ్రిటీలు, పొలిటీషియన్లు దశాబ్దాలుగా బస చేస్తున్న ఈ లగ్జరీ హోటల్​లోకి వరద నీళ్లు వచ్చాయి. దీంతో గెస్టులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. 1947లో కట్టిన ఈ భవనం ఒకప్పుడు ప్రైవేట్​ రెసిడెన్స్​గా ఉండేది. తర్వాత లగ్జరీ హోటల్​గా మార్చారు.

ఆర్ట్​ గ్యాలరీ అస్తవ్యస్తం

వెనిస్​లోని 18వ శతాబ్ధానికి చెందిన మరో బిల్డింగ్..​ పెసారొ మోడ్రన్​ ఆర్ట్​ గ్యాలరీ. ఈ మార్బుల్​ ప్యాలెస్​లోకి వరద నీరు రావటంతో షార్ట్​ సర్క్యూట్​ జరిగి లోపలి భాగాలు మంటల్లో కాలిపోయాయి. ఈ మోడ్రన్​ ఆర్ట్​ గ్యాలరీలోని డిస్​ప్లేలో ఎన్నో విలువైన పెయింటింగ్స్​, శిల్పాలు ఉన్నాయి.  ఈ హౌజ్​లోని పై ఫ్లోర్లలో ఓరియెంటల్​ మ్యూజియం ఉంది. అందులో జపాన్​, చైనా, ఇండోనేషియాలకు చెందిన 30 వేలకు పైగా ఆర్ట్​ వర్క్స్​ ఉన్నాయి.

సిటీ అందాలపై మాయని మచ్చ

సిటీలో వరదల లెక్కలను 1923లో ప్రారంభించాం. 1966లో దాదాపు రెండు మీటర్ల లోతు నీళ్లు నిలిచాయి. ఇప్పుడు 1.87 మీటర్ల వరకు వచ్చాయి. దీంతో నగరవ్యాప్తంగా ప్రమాద హెచ్చరికలు జారీచేశాం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించాం. గడచిన 50 ఏళ్లలో ఎప్పుడూ ఇంతగా వరదలు రాలేదు. క్లైమేట్​ ఛేంజ్​ వల్లే ఈ దుస్థితి వచ్చింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే వెనిస్ అందాల​పై పడ్డ ఈ మచ్చ మాసిపోదు. – ల్యుగి బ్రగ్నారో, వెనిస్​ మేయర్​

‘సిటీ ఆఫ్ లేక్స్’  

ఇటలీలోని వెనిస్​ కాలువల నగరంగా పాపులర్. ఈ సిటీలో ఎటుచూసినా కాలువలు, వాటిపై కట్టిన బ్రిడ్జిలే కనిపిస్తాయి. నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి పడవలపైనే ఇక్కడి ప్రజలు ఆధారపడతారు. నగరంలో చిన్న చిన్న వీధులు, సందులు ఎక్కువగా ఉంటాయి. సిటీలో వందకు పైగా దీవులున్నాయి. ఒక దీవి నుంచి మరొక దీవికి వెళ్లాలంటే పడవలే ఆధారం. ఈ దీవులన్నీ చిన్న చిన్న కాలిబాటల వంతెనలతో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ అన్ని దీవులను కలిపే పెద్ద కాలువను ‘గ్రాండ్ కెనాల్’ అని పిలుస్తారు. గ్రాండ్ కెనాల్ మధ్యలో ‘వాటర్ బస్’ లో నిలబడి చుట్టూ ఉన్న ప్రాంతాలను చూస్తూ ప్రయాణించడానికి టూరిస్టులు ఆసక్తి చూపుతుంటారు.

నగరానికే ప్రత్యేకమైన గొండోలా జర్నీ

గొండోలా తెగ ప్రజలు టూరిస్టులను పడవల్లో ఒక దీవి నుంచి మరో దీనికి తీసుకెళుతుంటారు. ఈ సందర్భంగా తమ వంశ చరిత్రను అలాగే వెనిస్ నగర చరిత్రను పాటల రూపంలో పాడి వినిపిస్తుంటారు. అంతేకాదు చిన్న చిన్న వీథుల్లో పడవలు వెళుతున్నప్పుడు ఆ ప్రాంత విశేషాలను కూడా వివరిస్తుంటారు. వెనిస్ సిటీ చూడటానికి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. ఏడాదికి  రెండు కోట్ల మందికి పైగా టూరిస్టులు వస్తుంటారని ఒక అంచనా. ఈ సంఖ్య ఏడాదికేడాదికి పెరుగుతోంది.