గండిపేట, వెలుగు: మన మూలాలను ఎప్పుడూ మరచిపోకూడదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయ సంస్కృతిలో గొప్ప సామాజిక, ధార్మిక విలువలు ఉన్నాయన్నారు. ఆదివారం హైదరాబాద్ అజీజ్ నగర్ సమీపంలోని ద వెన్యూ ఫంక్షన్ హాల్ లో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ.. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృదేశాన్ని మరవకూడదన్నారు. ‘‘మనం తెలుగువాళ్లం. తెలుగులోనే మాట్లాడుకుందాం. ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు, ఆ భాషలో మాట్లాడవచ్చు. కానీ ఇంగ్లిష్ వారిలా మారవద్దు. వారి సంస్కృతికి బానిసలు కావద్దు’’ అని ఆయన కోరారు.
‘‘చీమలకు చక్కెర పెట్టి, పశువులకు దండం పెట్టే సంస్కృతి మనది. ఆ సంస్కృతిని మరవద్దు’’ అని చెప్పారు. సంక్రాంతి పండగ అంటే ప్రృకృతిని ఆరాధించే పండగ అని అన్నారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి అని, సూర్యుడే మన జీవితానికి వెలుగు అని తెలిపారు. మన ముందు తరాలకు సంస్కృతీ సంప్రదాయాలను చేరవేసేందుకు ప్రతి ఒక్కరూ పది అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు. మూలాలకు వెళ్లాలని, భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి కృషి చేయాలని, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
పాశ్చాత్య జీవన విధానాన్ని మానుకుని భారతీయులుగా జీవించాలన్నారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని, సంప్రదాయ ఆహారంతోనే ఆరోగ్యం బాగుంటుందన్నారు. మాతృభాషను, ఇతర భారతీయ భాషలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మన కుటుంబ వ్యవస్థను కూడా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆట, పాట, భాష, యాస, కట్టు, బొట్టు మరవకూడదన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు..
కార్యక్రమంలో తెలుగుదనం, పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను తన సతీమణి ఉషమ్మ, ఇతర కుటుంబసభ్యులతో కలిసి వెంకయ్య సందర్శించారు. హరిదాసు సంకీర్తనలు, భోగి మంటలు, గాలిపటాలతో ఆవరణ కళకళలాడింది. పాతకాలపు మంచాలు, ఎడ్లబండి, రోళ్లు, రోకళ్లు, తిరగలి తదితర వస్తువుల ప్రదర్శన ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి తదితరుల రచనలతో కూడిన వండని వంటలు, తుమ్మేటి మిద్దెతోటకు హిందీ అనువాదం బాగ్ వని పుస్తకాలను వెంకయ్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, అనకాపల్లి ఎంపీ సి.ఎం.మేశ్, ఏపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డి, నటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు.