లెజెండరీ సింగర్ ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘ఘంటసాల ది గ్రేట్’. సింగర్ కృష్ణ చైతన్య టైటిల్ రోల్ చేశాడు. ఘంటసాల భార్య సావిత్రి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృదుల నటించారు. సిహెచ్ రామారావు దర్శకత్వంలో సిహెచ్ శ్రీమతి ఫణి నిర్మించారు. ఫిబ్రవరి 14న సినిమాను విడుదల కానుందని ప్రకటించారు. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను లాంచ్ చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘ఘంటసాల గారి జీవితంపై సినిమా తీయడం అభినందనీయం. ఆయన గురించి నవ తరం, యువ తరం, నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆయన పాత్రలో నటించిన యువ గాయకుడు కృష్ణ చైతన్య, శ్రీమతి పాత్రలో నటించిన మృదులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇదొక చక్కటి ప్రయత్నం. ఘంటసాలను శతాబ్ది గాయకుడు (సింగర్ ఆఫ్ సెంచరీ) అంటారు. సంగీతం ఉన్నంత కాలం ఆయన ప్రజల మనసుల్లో ఉంటారు. కమర్షియల్ హంగులతో కాకుండా సదుద్దేశంతో తీశారు కనుక సినిమా చూడటం తెలుగు వారి కర్తవ్యం’ అని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆర్ నారాయణమూర్తి, నిర్మాత అశోక్ కుమార్, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, నటులు అశోక్ కుమార్, సుబ్బరాయ శర్మ, నటి జయవాణి, నిర్మాత దామోదర ప్రసాద్, దర్శకులు కర్రి బాలాజీ తదితరులు హాజరై టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. తమను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని నటీనటులు, దర్శక నిర్మాతలు చెప్పారు.