- నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ రెడ్డి
- బంగారు తెలంగాణలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి
- కేసీఆర్ మళ్లీ వస్తే వేతనాలు, పెన్షన్లు బంద్
- మరో ఐదు రోజుల్లో నియంత పాలన పోతుందని కామెంట్
నల్లగొండ అర్బన్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలుచేసి తీరుతామని, లేకపోతే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు అడగబోమని నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, రైల్వే పార్క్, ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్, ఎన్జీ కాలేజీ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, క్రీడాకారులు, వాకర్స్, వ్యాపారులను వెంకట్ రెడ్డి కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ లాగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇవ్వదన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు.
కేసీఆర్ మళ్లీ సీఎం అయితే ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు నెలలకు ఒకసారి కూడా వేతనాలు ఇవ్వదన్నారు. కేసీఆర్ మోసపూరిత మాటలు నమ్మితే మన బతుకులు ఆగమవుతాయని హెచ్చరించారు. ‘‘రాష్ట్రంలో ఉద్యోగులు అనేక అవమానాలకు గురవుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ప్రతిఒక్కరూ గమనించాలి. ఉద్యోగ ఖాళీల భర్తీ ఒక్క కేసీఆర్ కుటుంబంలోనే జరిగింది. గత ఎన్నికల ముందు కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. నల్లగొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పి ఇక్కడి ప్రజలను మోసం చేసిండు. మరో ఐదు రోజుల్లో నియంత పాలన అంతమవుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సంక్రాంతి నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతం. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ స్టార్ట్ చేస్తం” అని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడంతో పాటు నల్లగొండను సిరిసిల్ల, సిద్దిపేటను మించి అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. నియోజకవర్గ ప్రజలంతా చేయి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
80 నుంచి- 85 సీట్లు గెలుస్తం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 80 నుంచి -85 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుందని, డిసెంబర్ 9న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి సీఎంగా ప్రమాణం చేస్తారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను మొదటి క్యాబినెట్ లోనే ఆమోదించి చట్టబద్ధతను తీసుకొస్తామని రాహుల్ గాంధీ కూడా చెప్పారన్నారు.
నిరుద్యోగులకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తామని, భూమి ఉన్న జర్నలిస్టులకు తక్షణమే ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. ఇవి ఆషామాషీ ఎన్నికలు కావని, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలని చెప్పారు.