నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్ చేసి మాట్లాడినట్లు ఓ ఆడియో బయటకు రావడం కలకలం రేపుతోంది. నల్గొండ మండలానికి చెందిన కాంగ్రెస్ కోఆప్షన్ మెంబర్ మహ్మద్, తానేదార్పల్లికి చెందిన మరికొంత మంది నాయకులు గురువారం హైదరాబాద్‌లో వెంకట్‌రెడ్డిని వ్యక్తిగత పనిమీద కలిసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వెంకట్‌రెడ్డి.. మహ్మద్ ఫోన్‌తో మునుగోడులో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్న కార్యకర్త బషీర్ కు కాల్ చేసి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేయమని కోరినట్లు సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతోంది.
రేవంత్ తన పీసీసీ పదవి పై, తనపై కుట్రలు చేస్తున్నారని గురువారం మునుగోడులో కామెంట్స్ చేసిన తెల్లారే వెంకట్‌రెడ్డి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. వెంకట్‌రెడ్డి ఆడియో టేపుల వైరల్‌పై కాంగ్రెస్ హైకమాండ్‌కు రిపోర్ట్ పంపిస్తామని కాంగ్రెస్మునుగోడు ఎన్నికల ఇన్చార్జ్ దామోదర్ రెడ్డి తెలిపారు.