పాత్రికేయ శిఖరం 

పాత్రికేయ శిఖరం 

చదువు పూర్తికాగానే ఇంగ్లీషు జర్నలిస్టుగా ఉత్తరభారతం వెళ్లడంతో ఎస్ వెంకట నారాయణ మనవాడే అన్న విషయం చాలామందికి తెలియకుండా ఉండిపోయింది. మన దేశంలోని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన జర్నలిస్టుల జాబితాలో వెంకటనారాయణ పేరు ప్రముఖ స్థానంలో ఉంటుంది. అప్పుడప్పుడు ఆయన పని మీద హైదరాబాద్ వచ్చినా తన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయేవారు. తెలుగు పత్రికలకు రాసింది తక్కువ. ఇండియా టుడే తెలుగు ఎడిషన్ వచ్చినపుడు అందులో ఒక కాలమ్ రాసేవారు. అది కూడా అంతర్జాతీయ అంశాలపైనే. ఆయన్ని కన్న తెలుగునేల అంతర్జాతీయస్థాయి జర్నలిస్టుగా ఎదగమని దీవించి పంపినట్లుగా ఆయన ఉద్యోగపర్వం గడిచిందనాలి.

ఓయూ  టాపర్​

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్న కమలాపూర్ అనే గ్రామంలో  సిరిమల్ల వెంకటనారాయణ ఒక మామూలు
 వెనుకబడిన కుటుంబంలో 1943లో జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువుతో పాటు రచన పట్ల కూడా ఆసక్తి ఉండేది. ఊర్లోని స్కూల్ మేగజైన్​లో  రాయడంతో ఆయన జర్నలిజం ప్రస్థానం మొదలైంది.

ఆ తరవాత ఆయన 1963లో నిజాం  కాలేజీలో డిగ్రీలో చేరారు. మొదటి నుంచి ఇంగ్లీషుపై ఆసక్తి ఉన్నందున డిగ్రీలో ఇంగ్లీషు, ఫ్రెంచ్ లను ఆప్షన్లుగా ఎంచుకున్నారు. ఆ తరవాత ఓయూలో 1967లో జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. అందులో టాపర్​గా నిలిచి షోయబుల్లా ఖాన్ గోల్డ్ మెడల్​ను గెలుచుకున్నారు. అదే సంవత్సరం టైమ్స్ ఆఫ్ ఇండియా, అహ్మదాబాద్ ఎడిషన్ లో రిపోర్టర్​గా చేరారు. 1979  ఇండియా టుడేలో చేరిన ఆయన 1984 దాకా సీనియర్ ఎడిటర్ గా పని చేశారు. 

దేశాధినేతలతో..

తన సర్వీసులో ఆయన ఎందరో దేశాధినేతలను ఇంటర్వ్యూ చేశారు. 65 దేశాలు పర్యటించారు. 1975లో సమ్మర్ స్కాలర్​గా సండే టైమ్స్ ఆఫ్ లండన్, 1978లో ది బోస్టన్ గ్లోబల్ పత్రికకు గెస్ట్ రైటర్​గా పనిచేశారు. ఇప్పటికి స్వతంత్ర మల్టీ మీడియా జర్నలిస్టుగా ఎన్నో విదేశీ పత్రికలకు తన రచనలను అందిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీలతో పాటు ఆయన రష్యన్, తమిళం, కన్నడం, గుజరాతీ భాషలను నేర్చుకున్నారు.

1979 లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఇందిరాగాంధీ వెంట విమానంలో వారం రోజులు తిరుగుతూ ఇంటర్వ్యూ చేశారు. 1983లో నెల రోజులపాటు పొద్దున నాలుగు నుండి ఏడు గంటల దాకా ఎన్టీ రామారావు మాటలను రికార్డు చేసి ఆయన జీవితచరిత్ర ను రాశారు. ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్​కు సౌత్ ఆసియా ప్రతినిధిగా ఆయన 2023లో మరోసారి ఎంపికయ్యారు. ఇలా ఆయన మూడోసారి ఈ పదవిలోకి వచ్చారు.

Also Read: రైతుకు ధీమా ఫసల్​ బీమా!

ఎఫ్సీసీకి అధ్యక్షుడిగా ఎంపికైన తొలి భారతీయుడు వెంకటనారాయణ. తన వృత్తిలో విజయాలుగా ఎన్నో పదవులు, పురస్కారాలు అందుకొన్న వెంకటనారాయణ 2024 - పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ సంపాదకులు అయిన పొత్తూరి వారి నాల్గవ వర్ధంతి సందర్భంగా  ఈ నెల 5న మంగళవారం పురస్కార ప్రదానం జరిగింది.

పుట్టిన ఊరికి ..

2002లో కాకతీయ యూనివర్సిటీ ఇచ్చిన గౌరవ డాక్టరేటు అందుకున్న సమయంలో తన ఊర్లో జరిగిన అభినందన సభలో ఓ పెద్దాయన ఢిల్లీలో బాగానే ఉన్నావ్, మరి ఊరికి ఏం చేశావు అన్న ప్రశ్నకు స్పందించి తాను పుట్టి పెరిగిన కమలాపూర్​లో విద్యార్థుల కోసం ట్రస్ట్ ఫర్ రూరల్ డెవెలప్​మెంట్​ ఏర్పాటుచేశారు. ఈ తరం పిల్లలు కంప్యూటర్, ఇంగ్లీషులపై పట్టు సాధించకపోతే ఎదగలేరని చెప్పారు. ఆయన స్థాపించిన శిక్షణ కేంద్రంలో ఆధునిక సాంకేతిక రంగాల్లో అవగాహన కల్పించే ఇంగ్లీషు, కంప్యూటర్ క్లాసులు నడుస్తున్నాయి.

 బి. నర్సన్,సీనియర్​ జర్నలిస్ట్