- కేసీఆర్, రేవంత్‌పై 6,741 ఓట్ల తేడాతో సంచలన విజయం
- ప్రజా సమస్యలపై ఉద్యమం
- సొంత పైసలతో అభివృద్ధి కార్యక్రమాలు..
- లోకల్ బీజేపీ అభ్యర్థికే పట్టంకట్టిన ఓటర్లు
కామారెడ్డి, వెలుగు : ఇటు కేసీఆర్.. అటు రేవంత్ రెడ్డి.. కామారెడ్డి నియోజకవర్గానికి ఇద్దరూ కొత్త అభ్యర్థులే. పోటీ వీరిద్దరి మధ్యేనని అనుకున్నారంతా!! ప్రచారమంతా వీరి చుట్టూనే సాగింది. సగం కౌంటింగ్ పూర్తయ్యే దాకా కూడా నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. కానీ ఉన్నట్టుండి వీళ్లిద్దరినీ వెనక్కి నెట్టి.. లీడ్‌లోకి వచ్చారాయన. ఆ ఆధిక్యాన్ని చివరిదాకా నిలుపుకున్నారు. సీఎంను, కాబోయే సీఎంను ఓడించి.. జెయింట్ కిల్లర్‌లా మారారు. ఎవరూ ఊహించని రీతిలో కామారెడ్డిపై బీజేపీ జెండా ఎగరేశారు. రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఆయనే కాటిపల్లి
వెంకట రమణా రెడ్డి!! ఐదేండ్లుగా ప్రజల్లోనే
ఐదేండ్లుగా ప్రజల్లోనే ఉన్న వెంకట రమణా రెడ్డి.. నిత్యం ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా నిరుడు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు. మాస్టర్‌ప్లాన్‌తో మున్సిపాలిటీలో విలీనమైన 9 గ్రామాల రైతులు నష్టపోతారని వ్యతిరేకించారు. విలువైన భూములను గ్రీన్‌జోన్‌గా, ఇండస్ట్రీయల్ జోన్‌గా ప్రకటించడం, అవసరం లేని ఏరియాల్లో 100 ఫీట్ల రోడ్లకు ప్రతిపాదనలు వంటి వాటిని మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొనడంపై రైతులను మేల్కొలిపారు. రైతుల పక్షాన ఉద్యమం నడిపారు.
నెలరోజుల పాటు వివిధ రూపాల్లో సాగిన ఉద్యమం ఇతర ప్రతిపక్షాలను కదిలించింది. పరిస్థితులు చేజారుతున్నాయని భావించిన ప్రభుత్వం దిగి వచ్చి.. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లు మున్సిపాలిటీలో తీర్మానం చేయించింది. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ బకాయిలపైనా వెంకటరమణా రెడ్డి పోరాటం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల మహిళలతో కలిసి వరుసగా ఆయన ఆందోళనలు చేశారు. ఎట్టకేలకు డ్వాక్రా మహిళలకు సంబంధించి పావలా వడ్డీ బకాయిలపై కొంత ఫండ్స్‌ను సర్కారు విడుదల చేసింది. అంతకుముందు 2018లో కూడా డ్వాక్రా మహిళలపై పావలా వడ్డీ బకాయిలపై వెంకటరమణా రెడ్డి ఆమరణ నిరహార దీక్ష చేశారు.
ధరణి, భూకబ్జాలు, ‘డబుల్’ ఇండ్లపైనా ధర్నాలు ధరణితో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెంకటరమణా రెడ్డి నాలుగు రోజుల పాటు ఆమరణ నిరహార దీక్ష చేశారు. కామారెడ్డి టౌన్, నియోజకవర్గంలోని గ్రామాల్లో భూకబ్జాలు, ఆక్రమణలు, రియల్ ఎస్టేట్‌లో స్కీమ్‌ల పేరిట మోసాలపై ఆందోళనలు నిర్వహించారు. ప్రజా దర్బార్చేపట్టి.. కొందరు బాధితులకు మేలు జరిగేలా చేశారు. కామారెడ్డి టౌన్‌లో డబుల్ బెడ్రూంఇండ్లను పంచాలంటూ ధర్నాలు చేశారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందిస్తానని, ఆఫీసర్లు నిర్భయంగా తమ పని చేసుకోవచ్చని, వ్యాపారులు తమ బిజినెస్‌లు ఎలాంటి చందాలు ఇవ్వకుండా, ఎవరికీ భయకుండా చేసుకోవచ్చని చెప్పారు. గతంలో కాంగ్రెస్‌నుంచి జడ్పీ చైర్మన్‌గా మూడేండ్లు పదవిలో కొనసాగిన ఆయన.. అప్పుడు తీసుకున్న మంచి నిర్ణయాలు తీసుకున్నారు. టీచర్ల బదిలీలు, ఇసుక క్వారీలు, వైన్స్‌షాపుల్లో అధిక రేట్లు తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
‘చలో గజ్వేల్’ చేపట్టి..
గజ్వేల్‌తోపాటు, కామారెడ్డిలోనూ పోటీ చేస్తానని సీఎం కేసీఆర్ అనూహ్యంగా ప్రకటించారు. దీంతో గజ్వేల్‌లో అభివృద్ధి పేరిట జరిగిన విధ్వంసం, రైతుల కష్టాలు, పునరావసం లేక భూ నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా ఇక్కడి ప్రజలకు చూపిస్తానంటూ ‘చలో గజ్వేల్’ ప్రోగ్రామ్‌ను వెంకటరమణా రెడ్డి చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను ముందస్తు అరెస్టు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో ఇక్కడ రేవంత్ రెడ్డిని పోటీలో దింపింది. అయినప్పటికీ వెంకటరమణారెడ్డి వెనకడుగు వేయలేదు. ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేశారు. కేసీఆర్, రేవంత్ నాన్‌లోకల్స్ అని, వారిలో ఎవరు గెలిచినా మళ్లీ వారిని కలవాలంటే మధ్యవర్తుల ద్వారా వెళ్లాల్సి ఉంటుందని, ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి ఉంటుందని జనంలోకి వెళ్లారు. కేసీఆర్ ఇక్కడి భూములపై కన్నేసి పోటీ చేస్తున్నారని వివరించారు.
స్థానికుడైన తననే గెలిపించాలని కోరారు. దీంతో నియోజకవర్గ ఓటర్లు ఆయనకే పట్టంకట్టారు. త్రిముఖ పోరులో కేసీఆర్, రేవంత్‌ను ఓడించి వెంకట రమణా రెడ్డి.. 6,741 ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించారు. ఆయనకు 66,652 ఓట్లు, కేసీఆర్‌కు 59,911 ఓట్లు, రేవంత్‌కు 54,916 ఓట్లు వచ్చాయి. బడా నాయకుల్ని కాదని, స్థానిక లీడర్‌ను కామారెడ్డి ఓటర్లు గెలిపించుకున్నారు. ఉప ఎన్నికను తప్పించారు.