పొంగులేటి రాజకీయ అజ్ఞానిగా మిగిలిపోవడం ఖాయం: తాతా మధుసూదన్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: సీఎం కేసీఆర్​పై అవాకులు, చవాకులు పేలితే ఊరుకునేది లేదని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ హెచ్చరించారు. మంగళవారం ఖమ్మంలోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర వెంకట వీరయ్య గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ధన బలంతో విర్రవీగుతున్న పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి రాజకీయ అజ్ఞానిగా మిగిలిపోతారన్నారు. తల్లకిందులుగా తపస్సు చేసినా ఖమ్మం జిల్లాలో రవ్వంత ప్రభావం కూడా చూపలేరని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ALSO READ :ఎడతెరిపిలేని వర్షాలు..ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి

తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసమే శ్రీనివాస్​రెడ్డి కాంగ్రెస్​లో చేరాడని, ఆయన చేరికతో ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న కాంగ్రెస్​నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న కేసీఆర్ పై ఎలా పడితే అలా మాట్లాడితే నాలుక చీరేస్తాం.. ఖబర్దార్ అంటూ తాతా మధుసూదన్ హెచ్చరించారు. ఎవరు ఎన్ని డ్రామాలు చేసిన జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, చింతనిప్పు కృష్ణచైతన్య, ఉద్యమకారుడు ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రాంమ్మూర్తి, బెల్లం వేణు, యలమద్ది రవి, లింగన్న, సతీశ్, పగడాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.