
- 97 జాతులకు చెందిన 13 వేలకుపైగా ఆవాసం
- రాష్ట్రంలో తొలి బర్డ్స్ విలేజ్ గా గుర్తింపునకు ఫారెస్ట్ అధికారుల ప్రయత్నాలు
మంచిర్యాల/లక్సెట్టిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట చెరువులో దేశ, విదేశీ పక్షుల సందడి నెలకొంది. దాదాపు 97 జాతులకు చెందిన 13వేలకు పైగా పక్షులు ఆవాసం ఏర్పర్చుకోగా.. నిత్యం కిలకిలరావాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. తిలకించేందుకు బర్డ్ లవర్స్ చెరువు వద్దకు క్యూ కడుతున్నారు. చెరువు దాదాపు 128 ఎకరాల్లో విస్తరించింది. దీని కింద సుమారు 400 ఎకరాల ఆయకట్టు ఉంది. వానాకాలం లో పూర్తిగా నీటితో నిండి ఉంటుంది. వేసవిలోనూ ఎండిపోదు.
చిత్తడి నేల కావడంతో దేశ విదేశాల పక్షులు ఇక్కడకు వస్తుంటాయి. గ్రామస్తులు కూడా పక్షులకు ఎన్నడూ ఎలాంటి హాని తలపెట్టరు. మహారాష్ర్టలోని యావత్మాల్ జిల్లా పందర్కవాడలోని షిరంజీ మోఘీ డిగ్రీ కాలేజీలో జువాలజీ లెక్చరర్ రంజాన్ విరానీ టీమ్ ప్రొఫెసర్ సుబోధ్ బన్సోద్, బర్డ్ సైంటిస్టులు వైష్ణవి చౌదరి, మహిమా చౌదరి జీవవైవిధ్య సర్వేలో భాగంగా గత నెల 16న ఇక్కడ పక్షుల సర్వే చేశారు. దాదాపు 97 జాతులకు చెందిన 13వేలకు పైగా పక్షులను గుర్తించారు.
విదేశాల్లో అరుదైన బ్లూ ఫేస్డ్ మల్కోవా, రెడ్ నెక్డ్ ఫాల్కన్ జాతులను గుర్తించారు. బ్లూ ఫేస్డ్ మల్కోవా ఇండియాతో పాటు శ్రీలంక, ఆకురాల్చే అడవుల్లో మాత్రమే కనిపిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలోనే తొలి బర్డ్స్ విలేజ్ గా వెంకట్రావుపేటను గుర్తించేందుకు చర్యలు తీసుంటున్నామని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు.