వెంకటాపురంలో 15 కిలోల గంజాయి పట్టివేత

వెంకటాపురం, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెంకటాపురం సీఐ బండారి కుమార్‌‌ చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వాజేడు పీఎస్‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌లో సీఐ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... కొత్త సంవత్సరం సందర్భంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన సిద్దార్థ, గజ్జల మధుకర్‌‌, కర్రెంగల మధుకర్‌‌, సాయి, సుధీర్‌‌, అఖిల్‌‌, సందీప్‌‌, వాజేడు మండలానికి చెందిన సాకేత్‌‌, వినయ్‌‌, పవన్‌‌, పృథ్వీ, మడకం పవన్‌‌తో పాటు మరో ఇద్దరు మైనర్లు కలిసి గంజాయి అమ్మేందుకు ప్లాన్‌‌ చేశారు.

ఇందులో భాగంగా రెండు రోజుల కింద ఒడిశాలోని కలిమెల గ్రామానికి వెళ్లి నాలుగు కేజీల గంజాయి కొని కారు, బైక్‌‌లపై తీసుకొస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వాజేడు ఎస్సై వెంకటేశ్వర్లు శుక్రవారం జగన్నాథపురం వై జంక్షన్‌‌ వద్ద నిఘా పెట్టారు. ఈ టైంలో వెంకటాపురం వైపు నుంచి వస్తున్న కారు, రెండు బైక్‌‌లను ఆపి తనిఖీ చేయగా గంజాయి దొరికింది.

దీంతో ఇద్దరు మైనర్లతో పాటు, మరో ఏడుగురిని అదుపులోకి తీసుకొని రూ. 4.45 లక్షల విలువైన 3.75 కేజీల గంజాయి, కారు, రెండు బైక్స్‌‌, ఆరు సెల్‌‌ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. వీరు పట్టుబడిన విషయం తెలుసుకున్న చెరుకూరి సందీప్, బోడెబోయిన వినయ్, కారం పవన్, మడకం పవన్, మడకం పృథ్వీ పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు. 

పర్వతగిరిలో 12 కిలోలు

పర్వతగిరి, వెలుగు : వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలంలోని చింత నెక్కొండ వద్ద 12 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు ఎస్సై వీరభద్రరావు చెప్పారు. శుక్రవారం టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులతో కలిసి చింత నెక్కొండ వద్ద తనిఖీలు చేయగా మహారాష్ట్రలోని వాశిం తాలూకా తరాలమంగ్రుల్పిర్‌‌కు చెందిన శంకర్‌‌ అశోక్‌‌ పవార్‌‌ వద్ద 12 కిలోల ఎండు గంజాయి దొరికిందన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చెసినట్లు చెప్పారు.
=