కామారెడ్డి, వెలుగు: వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తానన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. కామారెడ్డి, రాజంపేట, దోమకొండ, భిక్కనూరు మండలాల్లోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
ఫసల్‌బీమా యోజన అమలు చేసిఉంటే రైతులకు ఇబ్బందులు ఉండేవి కావన్నారు. నష్టం జరిగినప్పుడు రైతులకు బీమాతో పాటు పరిహారం వచ్చేదన్నారు. కొన్ని చోట్ల కరెంట్సప్లయ్ నిలిచిపోయినందున తిరిగి పునరుద్ధరించాలని ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లకు సూచించారు.