హైడ్రా పేరుతో కూల్చివేతలు ఆపకుంటే ఉద్యమిస్తం: వెంకటరామిరెడ్డి

హైడ్రా పేరుతో కూల్చివేతలు ఆపకుంటే ఉద్యమిస్తం: వెంకటరామిరెడ్డి
  •     పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లపై చర్యలుండవా? : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి 

హైదరాబాద్, వెలుగు: హైడ్రాపేరుతో నగరంలో చేస్తున్న కూల్చివేతలను ఆపకపోతే ప్రజల తరఫున పోరాడుతామని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలిపారు. హైడ్రా ఆలోచన బాగుందని, కానీ ఆచరణ సాధ్యం కావడం లేదన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. అక్రమంగా కబ్జాచేసి కట్టిన కట్టడాలను కూల్చడం సబబేనని, కానీ కట్టడాలకు గతంలో ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకు వచ్చే చోట ప్రజలు ఇండ్లు కొనుగోలు చేశారని తెలిపారు. అయితే, ఇప్పుడు అవి బఫర్ జోన్ లో ఉన్నాయనే కారణంతో కూలిస్తే వారి పరిస్థితి ఏంటని నిలదీశారు. భూములు కొనుగోలు చేసే సమయంలో చాలామందికి అది ఏ పరిధిలో ఉన్నందనే విషయం తెలియదన్నారు. కేవలం హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తుందా.. లోన్ వస్తుందా అని మాత్రమే చూశారని చెప్పారు. 

పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? 

అసలు బఫర్ జోన్ లో భూముల అమ్మకానికి, కొనుగోళ్లకు, ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారో తేల్చాలని వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.  ‘రియల్టర్లకు అనుమతులు ఎవరిచ్చారు.. లేఔట్ వేసేందుకు పర్మిషన్ ఇచ్చిందెవరు.. బఫర్ జోన్లు, చెరువులు, శిఖం భూములని తెలియకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండానే రియల్టర్ల చేతుల్లోకి వెళ్లాయా” అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తెలియకుండానే ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌ ప్రకారం డాక్యుమెంట్లు ఎలా తయారయ్యాయన్నారు. అనుమతి లేకుండానే లేఔట్లు ఎలా అయ్యాయో.. నిర్మాణంతో పాటు ప్లాట్లు ఎలా అమ్ముడయ్యాయో హైడ్రా చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇష్టారీతిన డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేసిన అధికారులపై చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. సామాన్యుల బతుకులు కూల్చడం తప్పా హైడ్రా కొత్తగా సాధించిందేమీ లేదని వెంకటరమణారెడ్డి విమర్శించారు.