వెంకటస్వామి వర్ధంతి స్పెషల్

  • ఇయ్యాల జి. వెంకటస్వామి వర్ధంతి

పేదరికం ఎలా ఉంటుందో నాకు తెలుసు. తినడానికి తిండి లేక ఉండడానికి నీడ కూడా దొరకక నేను బాధలు పడ్డ రోజులు గుర్తున్నై. అందుకే గరీబోని బాధ నా గుండెకు తాకింది. పేదోడి కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనతోనే గుడిసెల పోరాటాన్ని షురూ చేసిన. నీడ లేనివాళ్లకు ఖాళీ జాగలల్ల గుడిసెలు వేయించిన. సర్కారు, భూస్వాముల స్థలాలల్ల గుడిసెలు వేసుకుని బతుకుతున్న పేదోళ్లకు అండగ నిలబడ్డ. వాళ్లు ఏ కులపోళ్లు, ఏ మతంవాళ్లని చూడలే. ఎందుకంటే పేదరికానికి మతం, కులం, జాతి ఉండవు. 
‑ జి. వెంకటస్వామి (‘మేరా సఫర్​’ నుంచి..)

నిజాం వ్యతిరేక పోరాటాల నుంచి మొదలు పెడితే.. తెలంగాణ తొలి దశ ఉద్యమం.. కార్మికుల హక్కుల కోసం పోరాటం.. గుడిసెల కోసం ఉద్యమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే కాకా వెంకటస్వామి ఉద్యమాలే శ్వాసగా బతికారు. చివరి క్షణం వరకూ ఉద్యమాలకు, ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే.. కాకా జీవితం ఎన్నో ఉద్యమాలకు కేరాఫ్​ గా మారింది. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.

నిజాం వ్యతిరేక పోరాటాలతో ప్రారంభమైన కాకా వెంకటస్వామి రాజకీయ జీవితం కన్ను మూసే వరకూ ప్రజా ఉద్యమాలకే అంకితం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఆయన చూపిన చొరవ, పేదవారి కోసం పడిన తపన ఆయనను పేదల మనిషిగా నిలిపాయి. కాంగ్రెస్ పార్టీలో ఆయనను ఉద్యమాలకు కేరాఫ్​​అడ్రస్‌‌గా పిలిచేవారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో శ్రమించారు. రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైంది. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి సమావేశాన్ని బహిష్కరించడం ఆయన పట్టుదలకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కన్ను మూయనని ఎన్నోసార్లు చెప్పిన కాకా.. ప్రత్యేక రాష్ట్రం వచ్చినంకే అమరుడయ్యారు. తన కలను నెరవేర్చుకున్నారు.

అంచెలంచెలుగా ఎదిగి..
1929 అక్టోబర్​5న నిరుపేద దళిత కుటుంబంలో వెంకటస్వామి జన్మించారు. కార్మిక నేతగా మొదలై అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ఎదిగారు. గరీబోళ్ల కోసమే తన జీవితాన్ని ధారబోసిన వెంకటస్వామి.. తన ఇంటి పేరునే గుడిసెల వెంకటస్వామిగా సుస్థిరం చేసుకున్నారు. మాజీ ప్రధానమంత్రులు జవహర్‌‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధి, రాజీవ్ గాంధి, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌‌ తో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వారితో సమానంగా కాకాకు కాంగ్రెస్​ పార్టీలో గౌరవం ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 101 కార్మిక సంఘాలకు అధ్యక్షునిగా కొనసాగిన ఏకైక నాయకుడు కాకానే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదటి సారిగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1957--–62, 1978–-84లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1967లో తొలిసారి పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించారు. 1971లో 5వ లోక్ సభకు ఎన్నికై 1973 నుంచి 1976 వరకు కేంద్ర కార్మిక, పునరావాస శాఖల మంత్రిగా పనిచేశారు. 1977లో 6వ లోక్ సభకు ఎన్నికయ్యారు. 1978, 1982 మధ్య కేంద్ర కార్మిక, పౌర సరఫరాల శాఖల మంత్రిగా పనిచేశారు. 1982, 1984 మధ్య పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో, 1991లో ఎంపీగా ఎన్నికై గ్రామీణాభివృద్ధి, టెక్స్‌‌టైల్స్ శాఖల మంత్రిగా ఉన్నారు. 1995-–96 మధ్య కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో, 2002-–04 మధ్య ఎంపీగా కొనసాగారు. ఆ సందర్భంలో లోక్ సభలో డిప్యూటీ నాయకుడిగా ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్​ జాతీయ చైర్మన్‌‌గా కూడా ఆయన కొనసాగారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2004లో కాంగ్రెస్​తో టీఆర్ఎస్​కు పొత్తు కుదర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కాకా స్వచ్ఛందంగా పెద్దపల్లి సీటు నుంచి తప్పుకుని ఆ స్థానంలో చిన్న కుమారుడైన వివేకానందకు కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఇప్పించారు. తెలంగాణ ఉద్యమంలో తండ్రితో పాటు ఎంపీగా వివేకానంద కూడా కీలకంగా వ్యవహరించారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం
హైదరాబాద్​లో నిరుపేదల వైపు నిలబడి వేలాది మందికి గుడిసెలు వేసుకోవడానికి జాగాలు ఇప్పించడమే కాకుండా ఆయన నాయకత్వంలో గుడిసెలు కూడా వేయించారు కాకా. అందుకే ఆయన్ని పేదలంతా గుడిసెల వెంకటస్వామి అని ప్రేమగా పిలుచుకునే వారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనే మనస్తత్వం కాకాది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పలుమార్లు ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం, ఇంకా పలువురు పెద్దలతో సమావేశాలు జరిగినప్పుడు నేను కూడా అందులో కూర్చునే వాడిని. కాకా ఎవరినైనా ఆప్యాయంగా, ప్రేమగా చూసేవారు. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడేవారు. నియోజకవర్గానికి ఆయన వచ్చినప్పుడు, నియోజకవర్గ ప్రజలు ఆయన వద్దకు వెళ్లినప్పుడు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వారి సమస్యలను ఓపిగ్గా వినేవారు. అక్కడికక్కడే అధికారులతో ఫోన్లో మాట్లాడి లేదా అధికారులను పిలిపించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించేవారు. ఆయన తన నియోజకవర్గాన్ని సొంత కుటుంబంగా భావించేవారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు సికింద్రాబాద్​ మారేడుపల్లిలోని ఇల్లు ఎప్పుడూ జనంతో కిటకిటలాడేది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తన కుమారులు ఇద్దరు టీఆర్ఎస్‌‌లో చేరారు. కాంగ్రెస్ వాది అయిన కాకా ఆ సందర్భంలో కాస్త నొచ్చుకున్నా.. తెలంగాణ సాధన కోసం వెళ్లారని భావించారు. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్​ పార్టీ కోసం ఢిల్లీలో తనకు కేటాయించిన ఇల్లును సైతం దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధికి ఇచ్చేసిన గొప్ప వ్యక్తిత్వం గల నాయకుడాయన. దేశంలో, రాష్ట్రంలోని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ప్రధానంగా బొగ్గుగని కార్మికులు మరోవైపు అసంఘటిత కార్మికులు, నిరుపేదలు అంటే ఆయన అమితంగా ఇష్టపడేవారు. బొగ్గుగని కార్మికులకు ఇన్​కం​ట్యాక్సును మాఫీ చేయాలని కేంద్రంలో మంత్రిగా ఉండి పార్లమెంట్​లో గొంతెత్తిన మొదటి వ్యక్తి కాకానే.

తెలంగాణకు మరువలేని సేవలు
ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కళ్లారా తెలంగాణన చూశాకే తాను కన్నుమూస్తానని కాకా చాలా సందర్భాల్లో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన తర్వాతనే అంటే 2014 డిసెంబర్ 22న తన 87వ ఏట కాకా కన్నుమూశారు. కాకా కన్నుమూసినా తెలంగాణ ఎన్నటికీ ఆయన సేవలను మరచిపోలేదు. ఆయన అడుగుజాడలు, ఆయన కుటుంబ సభ్యులకే కాకుండా ఎందరికో ఈ రోజు వరకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రముఖ పౌరహక్కుల సంఘం నాయకుడు, న్యాయవాది కన్నాభిరాన్ తదితరులతో నక్సలైట్ల సమస్య పరిష్కారానికి, ఎన్ కౌంటర్ల నిలిపివేతకు కాకా చర్చలు కూడా జరిపారు. కన్నాభిరాన్ పలువురు ప్రముఖులు మారేడుపల్లిలోని కాకా ఇంట్లో ఈ విషయంపై చర్చించారు. తన ఇంటి నుంచే కాకా ఆ సందర్భంలో ఎన్​కౌంటర్లను నిలిపివేయాలని, నక్సలైట్ల అరెస్టులను ఆపాలని ముఖ్యమంత్రితో ఫోన్​లో నాయకులందరి ముందు మాట్లాడిన సందర్భాలెన్నో. పేద ప్రజల కోసం ఉద్యమించేవారంటే కాకాకు ఎంతో ఇష్టం. ఎన్ని కష్టాలొచ్చినా.. ఎన్నో రాజకీయ ఒడిదొడుకులను చవిచూసినా కాకా నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నారు. అధికారం కోసం నానా గడ్డి కరిచే ప్రస్తుత నాయకులకు కాకా జీవితం ఒక గుణపాఠం లాంటిది. ఎంతో ఆదర్శవంతమైన ఆయన జీవితం, ఆయన వేసిన బాట, అడుగు జాడలు భవిష్యత్తు తరాలకు పాఠం లాంటివి. కాకా గురించి ఎంత రాసినా, ఎంత చెప్పినా ఒడవదు. నాయకుడంటే కాకాలా ఉండాలి.

కాకా ఆత్మకథ మేరా సఫర్​ నుంచి..
పిల్లగానికి సీటు 
1952ల హైదరాబాద్ స్టేట్‌‌కు మొదటి దఫా ఎన్నికలు జరిగినయ్. నన్ను అసెంబ్లీకి పంపాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అయితే కొంతమంది పిల్లగాడికి సీటు ఇవ్వడం ఏందని గొణిగిన్రు. బూర్గులను కలిసి చెప్పిన్రు. “వెంకటస్వామికి ఇవ్వకుంటే ఎవరికిస్తం. హైదరాబాద్‌‌ల వెంకటస్వామికి మనకెవ్వరికీ లేనంత పలుకుబడి ఉంది. ఆయన చిటికేస్తే చాలు లక్షల మంది వస్తరు” అని బూర్గుల చెప్పిండు. బూర్గుల చెప్పినట్టు నిజంగనే నాకు ఆ రోజుల్ల హైదరాబాద్‌‌ల అంత పాపులారిటీ ఉండేది. కార్మికుల్ల, గుడిసెలవాసులల్ల నాకు అంతులేని అభిమానం ఉండేది. నేనంటే ప్రాణానికి ప్రాణం ఇచ్చేటోళ్లు వేలల్ల ఉండేది. ఎవరెన్ని చెప్పినా.. స్టేట్ కాంగ్రెస్ మాత్రం నాకే సపోర్ట్ చేసింది. మహబూబ్‌‌నగర్ నుంచి పోటీ చేయడానికి టికెట్ ఇచ్చింది. తీరా నామినేషన్ వేసే కాడికి వచ్చేసరికి నా వయసు విషయంల పంచాయితీ వచ్చింది. అప్పట్ల అసెంబ్లీకి పోటీ చేయడానికి కనీస వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు. కానీ నా స్కూల్ రికార్డ్స్ ప్రకారం నా వయసు అప్పటికి ఇరవై రెండు సంవత్సరాల లెక్క ఉంది. దాంతో నాకు హైదరాబాద్ రాష్ట్ర మొదటి అసెంబ్లీ ఎన్నికల్ల పోటీచేసే అవకాశం వచ్చినట్టే వచ్చి జారిపోయింది.

చిటికేస్తే లక్షల్ల జనం
1949ల ‘నేషనల్ హట్స్ యూనియన్’ను స్థాపించిన. అసొంటి యూనియన్ ఏర్పాటు కావడం దేశంల అదే మొదటిసారి. అదే ఆఖరిసారి. 20 ఏండ్ల పాటు నేషనల్ హట్స్ యూనియన్ తరపున పోరాటం చేసి దాదాపు 80వేల గుడిసెలు వేయించిన. గుడిసెవాసులకు అంత పెద్ద ఎత్తున భూములు ఇప్పించిన ఘనత మా సంఘానిదే. నేను చిటికేస్తే లక్షల్ల జనం వచ్చేది. గుడిసెవాసులకు నేనంటే ప్రాణం. దేవుడోలె చూసేవాళ్లు..కల్మషం లేని ఆ మనుషుల ఆప్యాయత, అనురాగం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేది. కాలనీలకు నా పేరు పెడతమని ఒక్కోసారి జిద్దు చేసేది. వద్దని వాళ్లకు నచ్చచెప్పిన వినకపోయేది. ఎట్లనో బుదరకించి పంపించేది. గుడిసెవాసులంత నన్ను “కాకా” అని ప్రేమతో పిలిచేది. ఆ పిలుపే నా మారు పేరయింది. ఇంతేకాదు గుడిసెల పోరాటంతో నా ఇంటి పేరు కూడా మారింది. గడ్డం వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామి అయిండు. గుడిసెల పోరాటంల సెంటు భూమిని కూడా నా స్వార్థానికి తీసుకోలేదు. కట్టుబట్టలతో నా ముందుకొచ్చిన ప్రతి పేదోడికీ నేను స్థలం చూపించి గుడిసె వేయించిన. పేరు కోసమో, పైసల కోసమో ఇదంతా చెయ్యలేదు. నా కోసం, నా ఆత్మసంతృప్తి కోసం చేసిన. పేదోడి కోసం అట్ల చేయడం మనిషిగా నా కనీస బాధ్యత అనిపించింది.

సింగరేణితో విడదీయరాని బంధం
సింగరేణి కార్మికులతో నాది విడదీయరాని బంధం. కార్మికుల కోసం నేనెంత కష్టపడ్డానో వాళ్లు కూడా నన్ను, నా కుటుంబాన్ని గుండెల్ల పెట్టి చూసుకున్నరు. 1990ల సింగరేణి కంపెనీ శాన నష్టాలల్ల కూరుకుపోయింది. మూతపడే స్థితికి వచ్చింది. నేను చొరవ తీసుకొని ఎన్.టి.పి.సి.తో మాట్లాడి 200 కోట్ల రూపాయల రుణం ఇప్పించిన. ఆ తర్వాతే కంపెనీ నిలదొక్కుకొని క్రమంగా లాభాలల్లకి వచ్చింది. బి.ఐ.ఎఫ్.ఆర్. లిస్ట్ నుంచి కూడా బయటపడ్డది. కంపెనీ మూతపడకుండా ఆపడంతో పాటు లక్షా 20వేల మంది కార్మికుల ఉద్యోగాలను కాపాడగలిగానన్న సంతృప్తి నాకుంది. అప్పటి కృషి ఫలితాలు ఇప్పుడు సింగరేణిల కనిపిస్తున్నాయి. కంపెనీ నుంచి ఏటా 50 మిలియన్ టన్నులకుపైగా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. అనేకమంది కార్మికులు 60వేల రూపాయల వేతనాలు అందుకుంటుంటే అందరికీ 20 శాతం బోనస్ ఇస్తున్నరు. ఇదంతా చూస్తుంటే గర్వంగా అనిపిస్తది.

- ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్టు

పేదల పక్షపాతి
తెలంగాణ రాజకీయాల్లో వెంకటస్వామిది విలక్షణమైన పాత్ర. చెన్నారెడ్డిలాంటి వాళ్లకంటే భిన్నంగా ఎవరికీ తీసిపోని విధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం పోరాడారు. దాదాపు 60 ఏండ్లపాటు పార్లమెంటరీ రాజకీయాల్లో సామాన్యులు.. ముఖ్యంగా దళితులు, పేదలను చైతన్యపరుస్తూ వారి అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా సేవలందించారు. రామగుండం పారిశ్రామికాభివృద్ధికి కృషి చేశారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించే అరుదైన వ్యక్తిత్వం కాకా సొంతం.
- ప్రొఫెసర్​ ఘంటా చక్రపాణి, టీఎస్​పీఎస్సీ మాజీ చైర్మన్

భాష, యాసలతో జనాలకు చేరువైన్రు
దళితజాతి నుంచి వచ్చిన మహానాయకులు, దివంగత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్​రామ్​లాగే కాకా కూడా సుధీర్ఘకాలంపాటు ప్రజాప్రతినిధిగా సేవలందించారు. అవకాశాలు సృష్టించుకుంటూ, వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగారు. అవకాశం వస్తే ఎంత సమర్థంగా పని చేస్తారో అన్నదానికి కాకా ప్రత్యక్ష నిదర్శనం. తెలంగాణ భాషలో, హైదరాబాద్​ యాసలో మాట్లాడే ఆయన పేదలకు మరింత చేరువయ్యారు. తన పిల్లలకు కులాంతర పెళ్లిళ్లు జరిపించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.
- బీఎస్  రాములు, సామాజిక తత్త్వవేత్త

సీఎం కావాల్సిన నాయకుడు  
సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెంకటస్వామి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. ఆయన రోజు కూలీగా కూడా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ, నాటి ప్రధాని ఇందిరాగాంధీకి విధేయుడు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్–టీఆర్​ఎస్  మధ్య పొత్తు కుదర్చడంలో కాకాది కీలకపాత్ర. తెలంగాణ ఆకాంక్ష నెరవేరేందుకు తన వంతు కృషి చేశారు. ఆయన సీఎంగా, రాష్ట్రపతిగా సేవలు అందించాల్సి ఉండే. అయితే నాటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన్ను పక్కనబెట్టారు. అయినా ఆయనేం బాధపడకుండా నమ్మిన సిద్ధాంతం కోసం జీవించారు.
- పి.చంద్, కాకా ఆత్మకథ ‘మేరా సఫర్’ రచయిత

ప్రజాసంక్షేమమే కాకా తపన
కార్మిక సంఘం లీడర్​గా ఉన్నా, మంత్రిగా ఉన్నా కాకా తపనంతా ప్రజా సంక్షేమం కోసమే. నేను 1991లో జాబ్ కోసం వెళ్లినప్పటి నుంచి కాకా చనిపోయేవరకూ ఆయనతో మంచి సంబంధాలున్నాయి. తన దగ్గర పనిచేసే వారందరినీ తన కుటుంబ సభ్యులుగానే ఆయన భావించేవారు. కేంద్రమంత్రిగా ఉన్నా అందరితో కలివిడిగా ఉండేవారు. అంబేద్కర్​ను చూసి ఇన్​స్పైర్​ అయిన కాకా ఆయన ఆశయాల కోసం పనిచేస్తూ.. అందరికీ చదువు అందించాలన్న ఆశయంతోనే అంబేద్కర్ కాలేజీని ఏర్పాటు చేశారు. 
- ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్