ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా యువ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ జాక్ పాట్ కొట్టాడు. పంత్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ లాంటి ఆటగాళ్లు భారీ ధరకు పలుకుతారని ముందుగానే ఊహించినా అయ్యర్ వెంకటేష్ అయ్యర్ మాత్రం ఊహించని విధంగా భారీ ధరకు అమ్ముడు పోయి అందరినీ షాక్ కు గురి చేశాడు. వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది.
అయ్యర్ కోసం వేలంలో ఆర్సీబీ, లక్నో, కోల్ కతా హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఈ ఆల్ రౌండర్ ను దక్కించుకునేందుకు పోటా పోటీగా ధర పెంచుకుంటూ పోయాయి. అయితే.. అంతా భారీ ధర పెట్టలేక ఆక్షన్ నుండి లక్నో, ఆర్సీబీ వెనక్కి తగ్గడంతో చివరకు కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్‌ను తిరిగి దక్కించుకుంది. ఇదిలా ఉంటే రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపించని కేకేఆర్ అయ్యర్ కోసం భారీ ధర వెచ్చించడం విశేషం.
అంతకముందు కేకేఆర్ రిటెన్షన్ లిస్టులో తన పేరు లేకపోవడంతో కన్నీళ్లు వచ్చాయని అయ్యర్ చెప్పుకొచ్చాడు. అయితే, వేలంలో ఫ్రాంచైజీ తనను తిరిగి కొనుగోలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అతను ఆశించినట్టుగానే కేకేఆర్ అతన్ని మెగా ఆక్షన్ లో భారీ ధరకు దక్కించుకున్నారు. కేకేఆర్ జట్టు తనను తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని.. కెప్టెన్సీ ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని పరోక్షంగా చెప్పుకొచ్చాడు.
"నితీష్ రాణా దురదృష్టవశాత్తు గాయపడినప్పుడు అతని గైర్హాజరీలో జట్టుకు కెప్టెన్‌గా ఉండే అవకాశం నాకు లభించింది, నేను వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాను" అని కేకేఆర్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన తర్వాత వెంకటేష్ చెప్పాడు. వెంకటేష్ అయ్యర్ కు కెప్టెన్సీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రస్తుతం కోల్ కతా జట్టును నడిపించడానికి సరైన కెప్టెన్ లేడు.
అయ్యర్ గత నాలుగు ఐపీఎల్ సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. 2021లో జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలోనూ.. 2024 సీజన్‌లో ఆ జట్టు ట్రోఫీ ముద్దాడడంలోనూ తనవంతు సహకారం అందించాడు. ఓపెనర్‌గా మంచి భాగస్వామ్యాలు అందించాడు. గడిచిన సీజన్‌లో 4 అర్ధసెంచరీలు బాదాడు. మొత్తంగా 158.80 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 370 పరుగులు సాధించాడు.