Ranji Trophy: గాయంతో విలవిల్లాడిన రూ. 23 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్‌ ఆడేది అనుమానమే

Ranji Trophy: గాయంతో విలవిల్లాడిన రూ. 23 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్‌ ఆడేది అనుమానమే

ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా  ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ జాక్ పాట్ కొట్టిన సంగతి తెలిసిందే. అతన్ని కోల్‎కతా  నైట్ రైడర్స్ ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అయ్యర్ గత నాలుగు ఐపీఎల్ సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. 2021లో జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలోనూ.. 2024 సీజన్‌లో ఆ జట్టు ట్రోఫీ ముద్దాడడంలోనూ తనవంతు సహకారం అందించాడు. ఐపీఎల్ 2025 కోసం వెంకటేష్ అయ్యర్ పై కేకేఆర్ భారీ అంచానాలు పెట్టుకుంది. 

ఆల్ రౌండర్ గా జట్టును ముందుకు నడపగలడని అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పనున్నారని సమాచారం. ఈ దశలో ఈ ఆల్ రౌండర్ కు దురదృష్టం వెక్కిరించింది. రంజీ ట్రోఫీలో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చీలమండ గాయం అతన్ని వేధించింది. యార్కర్ ఎదుర్కొనే సమంయంలో అతనికి ఈ గాయం అయినట్టు తెలుస్తుంది. గ్రౌండ్ లోకి ఫిజియో వచ్చినప్పుడు నొప్పితో విలవిల్లాడాడు. దీంతో రిటైర్డ్ హర్ట్ గా మైదానం నంచి వెనుదిరిగాడు. 

ALSO READ | Ranji Trophy: రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్.. ఘోరంగా విఫలమైన టీమిండియా క్రికెటర్లు

అయ్యర్ గాయం తీవ్రమైనదిగా కనిపిస్తుంది. అయితే అయ్యర్ తిరిగి బ్యాటింగ్ రావడం సంతోషించే విషయం. మ్యాచ్ తర్వాత అతనికి స్కానింగ్ నిర్వహించాల్సి ఉంది. ఒకవేళ గాయం తీవ్రమైనదిగా తేలితే మరో రెండు నెలల్లో ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్ కు అయ్యర్ దూరం అయ్యే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ కు ముందు ఈ విషయం కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తుంది.