Saindhav Movie Review: వెంకటేష్ యాక్షన్ ఎమోషన్ థ్రిల్లర్‌

హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కెరీర్ మైల్ స్టోన్ 75వ మూవీ సైంధవ్ (Saindhav). హిట్ సీరిస్తో టాలెంటెడ్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన శైలేష్ కొలను (Sailesh Kolanu) ఈ సినిమాను తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇవాళ (జ‌న‌వ‌రి 13న) సంక్రాంతి కానుక‌గా థియేటర్లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది సైంధవ్. యాక్షన్  స్పార్క్..తండ్రి కూతురి ఎమోషన్స్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ..అన్ని వర్గాల ఆడియాన్స్ను ఆకట్టుకుందో లేదో రివ్యూలో తెలుసుకుందాం. 

క‌థేంటంటే:

సైంధవ్ ప్రధాన కథ అంతా చంద్ర‌ప్ర‌స్థ అనే ఫిక్షనల్‌ టౌన్‌ లో జరిగే డ్రగ్ సరఫరా, గన్ బిజినెస్..వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది.   చంద్ర‌ప్ర‌స్థ లో జరిగే అసాంఘిక కార్యక్రమాలకు కార్టెల్ లీడర్ విశ్వామిత్ర (ముఖేష్ రిషి) నిర్వహణలో ప్రతిదీ జరుగుతుంటుంది. ఇక్కడ చంద్ర‌ప్ర‌స్థ లో జరిగే బిజినేస్ ను చూసుకోవడానికి విశ్వామిత్ర దగ్గర పనిచేసే మాఫియా లీడర్‌ వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్ధిఖి)కి బాధ్యతలు అప్పగిస్తాడు. వికాస్ మాలిక్ తన అనుచరురాలు జాస్మిన్ (ఆండ్రియా)తో ఈ డీల్‌ పనులన్నిటినీ జరిగేలా చూస్తుంది. అలా ఓ రోజు వారికి పెద్ద బిజినెస్ డీల్ కుదురుతుంది. 20 వేలమంది యువతతో పాటు గన్స్‌, డ్రగ్స్‌ సరఫరా చేసే ఈ డీల్‌ ను సక్రమంగా పూర్తి చేయాలనీ విశ్వామిత్ర వికాస్ కు బాధ్యతలు అప్పగిస్తాడు. అలా డ్రగ్స్ డీల్ జరిగే క్రమంలో సైంధవ్ కోనేరు అలియాస్‌ సైకో(వెంకటేష్‌) చంద్రప్రస్థ టౌన్‌ పోర్టులో ఉద్యోగిగా పనిచేయడానికి వస్తాడు.

అతనికి కూతురు గాయత్రి(సారా పాలేకర్‌) అంటే ఎంతో ప్రాణం. పక్కింట్లో నివాసం ఉంటున్న మనో(శ్రద్ధా శ్రీనాథ్‌) ప్రతిక్షణం ఎప్పుడు తన కూతురిని జాగ్రత్తగా చూసుకుంటుంది. తన కూతురి కోసం కష్టపడే సైంధవ్‌ అంటే మనోకి ఇష్టం. మనో భర్త (గెటప్‌ శ్రీను) తరుచూ కొట్టడంతో.. అతనిపై పోలీసు కేసు పెట్టి, ఒంటరిగా ఉంటుంది. అలా గాయత్రిని సొంత కూతురిలా చూసుకుంటుంది. ఒకసారి అనుకోకుండా స్కూల్ లో కళ్ళు తిరిగి పడటంతో ఆసుపత్రికి తీసుకెళతారు. అపుడు గాయత్రి కి ఉన్న నరాల సంబంధించిన స్పైన‌ల్ మ‌స్కుల‌ర్ అట్రోపి అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు చెబుతారు డాక్టర్స్.

కూతురి గాయత్రికి అర్జెంటు గా ఒక ఇంజక్షన్ కావాలి. సరైన టైం లో ఇంజక్షన్ ఇవ్వకపోతే బతకడం కష్టం అని డాక్టర్స్ చెబుతారు. కూతురిని కాపాడ‌టానికి 17 కోట్ల ఖ‌రీదైన ఓ ఇంజెక్ష‌న్ అవసరమవుతుంది. చంద్రప్రస్థ లో ఉద్యోగిగా ఉన్న సైంధవ్.. డబ్బు కోసం విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌ను చంపడానికి.. మైఖేల్ (జిషు సేన్ గుప్తా)తో బిగ్ డీల్‌ కుదుర్చుకుంటాడు. అలా ఒకరోజు పోర్టులో  జరిగే పెద్ద డీల్ ను సైంధవ్ ఆపడంతో..పెద్ద ఫైట్ జరుగుతుంది.అక్కడ జరిగిన వార్ లో సైంధవ్ కాస్తా సైకో అంటూ రివీల్ అవుతాడు. అసలు సైంధవ్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటి? సైకో..సైంధవ్ గా ఎలా మారాడు? ఐదేళ్ల క్రితం ఏం జరిగింది? ఇంతకు విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌లను చంపేందుకు మైఖేల్‌ ఎందుకు ప్రయత్నించాడు?  చివరికి  సైంధవ్ తన కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? కూతుర్ని రక్షించుకున్నాడా? లేదా? అనేదే మిగతా స్టోరీ. 

ఎలా ఉందంటే:

తండ్రీకూతుళ్ల అనుబంధానికి.. ఫిక్షనల్ యాక్ష‌న్ అంశాల‌ను జోడించి.. డైరెక్టర్ శైలేష్ కొల‌ను సైంధ‌వ్ క‌థ రాసుకున్నారు. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌,స్టైలిష్ మేకింగ్‌తో ఆడియెన్స్‌కు విజువ‌ల్ ట్రీట్‌లా సినిమాను మలిచాడు. చంద్ర‌ప్ర‌స్థ అనే ఫిక్ష‌న‌ల్ వ‌ర‌ల్డ్‌... త‌మ అక్ర‌మాల‌కు పిల్ల‌ల‌ను పావులుగా వాడుకోవాల‌ని ప్ర‌య‌త్నించే డేంజ‌ర‌స్‌ గ్యాంగ్‌..వారిని ఎదిరించే ఓ స‌గ‌టు తండ్రి .. అత‌డికో ప‌వ‌ర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ టెంప్లేట్ స్టోరీలైన్‌ను తీసుకుని వెంక‌టేష్ క్యారెక్ట‌రైజేష‌న్‌, ఎలివేష‌న్స్ పాస్ మార్కులు కొట్టేశారు. ప్రాణాపాయంలో ఉన్న కూతురును రక్షించుకునేందుకు.. అన్నివిధాలుగా సైంధ‌వ్ ప్రయత్నించే సీన్స్ ఆకట్టుకుంటాయి. చివరికి కార్టెల్‌లోకి అడుగు పెట్టాల్సి రావ‌డం.. డ‌బ్బు అందిన‌ట్టే అంది, అంత‌లోనే ఎదుర‌య్యే చిక్కుముళ్లతో ఫస్టాఫ్ సాగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఇంటర్వెల్ లో ఇచ్చే ట్విస్ట్..అక్కడ జరిగే ఫైట్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 

ఇలాంటి ఎమోషనల్ యాక్షన్ సినిమాలకు సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ పెంచడం ముఖ్యమని డైరెక్టర్ ఆలోచించిన తీరు బాగుంది. సైంధవ్ ఫ్లాష్‌బ్యాక్ మొద‌లుకుని..తన కూతురు పడే స్ట్రగుల్ చూసి బాధపడే సైంధవ్ కి ఇంకా చాలా మంది చిన్నారులు కూడా ప్ర‌మాదంలో ఉన్నారని తెలియటంతో.. కంటైనర్ల కోసం విల‌న్ సైంధ‌వ్‌ని వెంటాడ‌టం ఇవ‌న్నీ ఆడియాన్స్ కు ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. వెంకీ తన యాక్ష‌న్ ఎపిసోడ్లతో..మాస్ యాక్షన్ ఫ్యాన్స్ కు భలే ఫెస్టివల్ ట్రీట్ ఇస్తాడు. ఎమోషన్ సీన్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తాడు. విలన్ గా చేసిన న‌వాజుద్దీన్ సిద్ధిఖీ క్యారెక్టర్ లో.. కామెడీతో పాటు ఇంటెన్స్ చూపించాడు డైరెక్టర్. అతనిపై వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ కు భలే అనిపిస్తాయి. 

ఎవరెలా చేశారంటే:

సైంధ‌వ్ సినిమా వెంక‌టేష్ నుంచి వ‌చ్చిన మ‌రో డిఫ‌రెంట్ యాక్ష‌న్ ఎమోషన్ ఫిల్మ్. వెంకీ యాక్టింగ్‌, యాక్ష‌న్, ఎమోషన్ కోసం ఈ సినిమా చూడొచ్చు. సైంధ‌వ్ అలియాస్ సైకో క్యారెక్టర్ లో వెంక‌టేష్ చెలరేగిపోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే వెంకీ సైంధవ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. వెంకటేశ్‌ తర్వాత ఈ సినిమాలో బలంగా ఇంపాక్ట్ చూపించిన క్యారెక్టర్ నవాజుద్దీన్‌. తన వర్సటైల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, రుహాణిశ‌ర్మ త‌మ పాత్ర మేరకు మెప్పిస్తారు. జాస్మిన్‌గా ఆండ్రియా యాక్షన్‌ సీన్‌ అదరగొట్టేసింది. 

టెక్నీషియన్స్:

మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్‌ నారాయణన్‌ బుజ్జికొండవే సాంగ్ ఆడియన్స్ ను మెప్పిస్తుంది. అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ మ‌ణికంద‌న్ ఇంద్ర‌ప్ర‌స్థను చూపించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. అవినాష్ కొల్లా ప్రొడ‌క్ష‌న్ డిజైన్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. డైరెక్టర్ శైలేష్ కొల‌ను జోనర్ లో డిఫరెంట్ ఫిల్మ్ సైంధ‌వ్ అని చెప్పుకోవాలి.