
అబర్నెల్ (అమెరికా): ఇండియా స్టార్ ఆర్చర్, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ తన గురితో మరోసారి అదరగొట్టింది. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1లో రిషబ్ యాదవ్‌తో కలిసి కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సురేఖ–రిషబ్ జోడీ 153–-151 తేడాతో చైనీస్ తైపీకి చెందిన హువాంగ్ ఐ-జౌ– చెన్ చియె లున్‌లపై ఉత్కంఠ విజయం సాధించింది.
తొలి రెండు సెట్లలో వెనుకంజ వేసినా అద్భుతంగా పుంజుకున్న ఇండియా ద్వయం పసిడి పతకం సొంతం చేసుకుంది. వరల్డ్ కప్‌లో సురేఖకు ఇది 11వ గోల్డ్ కాగా.. రిషబ్ యాదవ్‌కు మొదటిది. ఈ కాంపౌండ్ కేటగిరీని ఇటీవలే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ప్రోగ్రామ్‌లో చేర్చడం గమనార్హం.