- సిరిసిల్ల బీఆర్ఎస్ నేతల భూదందాలో కొత్త కోణం
- బైపాస్ వస్తదని ముందే తెలుసుకుని తక్కువ ధరకు అసైన్డ్ భూముల కొనుగోలు
- ప్లాట్లుగా చేసి నోటరీపై అమ్మకాలు
- రూ.10 కోట్ల మేర వెనకేసుకున్న తాజా మాజీ సర్పంచ్ భర్త
- రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్‌లో వెలుగులోకి
కరీంనగర్/సిరిసిల్ల, వెలుగు: వ్యవసాయం చేసుకునేం దుకు పేదలకు ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములను బీఆర్ఎస్ లీడర్లు వెంచర్లుగా మార్చేశారు. కొత్తగా వేసే బైపాస్ రోడ్డు ఎలా వెళ్లబోతోందో ముందే కనుక్కొని.. ఆ ఏరియాలో భూములు కొనుక్కొని రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో ఇలాంటి భూ భాగోతమే తాజాగా వెలుగు చూసింది. బైపాస్ సమీపంలో ఓ బీఆర్ఎస్ లీడర్ తన కుటుంబ సభ్యుల పేరిట 9.17 ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను కొనుగోలు చేసి, ప్లాట్లు వేశాడు. ఈ వెంచర్లో సగానికిపైగా ప్లాట్లను ఇప్పటికే నోటరీపై అమ్మేశాడు. మూడు ఫామ్ హౌస్‌లు కూడా నిర్మించాడు.
బైపాస్ సమీపంలో వెంచర్..
గత సర్కార్ హయాంలో ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామం మీదుగా జగ్గరావుపల్లె, పెద్దూర్ శివారు నుంచి సిరిసిల్ల వరకు బైపాస్ రోడ్డు మం జూరు చేశారు. 375, 247 సర్వే నంబర్లలోని అసైన్డ్ భూములకు సమీపంలో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలుసుకున్న స్థానిక బీఆర్‌ఎస్ లీడర్, తాజా మాజీ సర్పంచ్ భర్త కోల నర్సయ్య ఆయా భూములపై కన్నేశారు. బైపాస్ వెళ్లే మార్గానికి సమీపాన 375/9 సర్వే నంబర్ లో గడ్డం మణెవ్వకు ఉన్న 30 గుంటలు, 375/10 సర్వే నంబర్ లో చాకలి పూలవ్వ వద్ద 30 గుంటలతోపాటు 247/11లోని 1.20 ఎకరాలు కలిపి మొత్తం 3 ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. 2018 ఆగస్టులో తన కూతురు కోల సింధూజ పేరిట మార్చారు. అలాగే, 247/7 సర్వే నంబర్ లో తలారి రాజనాల భిక్షపతికి 4 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉండగా.. ఆయన ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని 3.23 ఎకరాల భూమిని కోల నర్సయ్య కొనుగోలు చేసి, తన పేరిట మార్పించుకున్నారు. 247/19లో కొండ పద్మ పేరిట ఉన్న 34 గుంటల అసైన్డ్ ల్యాండ్ తోపాటు 1121/27 సర్వే నంబర్లోని 2 ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను తన భార్య కోల అంజవ్వ పేరిట లావణి పట్టా పొందారు. ఇలా మొత్తం తన కుటుంబం పేరిట 9.17 ఎకరాల అసైన్డ్ భూమిని సొంతం చేసుకున్నారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం తర్వాత గత ప్రభుత్వం మెడికల్ కాలేజ్, అపెరల్ పార్కు, ప్రభుత్వ మహిళా పెట్రోల్ పంపు, వర్కర్ టూ ఓనర్ షెడ్లు, హరిత హోటల్ లాంటి నిర్మాణాలు చేపట్టింది. దీంతో రోడ్డు సమీపాన ఎకరాకు రూ.5 కోట్లకుపైగానే ధర పలుకుతున్నది. అసైనీలకు ఎకరాకు రూ.2 లక్షలు కూడా ఇవ్వని నర్సయ్య.. బైపాస్ రోడ్డు నిర్మాణం తర్వాత ఈ భూమిని వెంచర్ గా మార్చి.. గుంటకు రూ.4 లక్షల చొప్పున కొన్ని ప్లాట్లు నోటరీపై అమ్మేశాడు. ఇలా ఇప్పటికే రూ.10 కోట్ల మేర వెనకేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే, అసైన్డ్ ల్యాండ్స్ లో చేపట్టిన ఇండ్లకు ఇంటి నంబర్లు కూడా కేటాయించినట్టు తెలిసింది.
16.20 ఎకరాల ప్రభుత్వ భూమి మాయం
వెంకటాపూర్ గ్రామ పరిధిలోని 119/1 సర్వే నంబర్ లో 2012– -13, 2013-–14 పహాణీల ప్రకారం.. 134.17 ఎకరాల ప్రభుత్వ భూమి (పోరంబోకు) ఉంది. కానీ, తెలంగాణ వచ్చాక 4 ఏండ్లలోనే ఈ సర్వే నంబర్ లో 16.20 ఎకరాలు మాయం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చట్టానికి విరుద్ధంగా పట్టాలు
ప్రస్తుతం కోల నర్సయ్య కుటుంబం పేరిట అసై న్డ్, పట్టా భూమి కలిపి 26.33 ఎకరాలు ఉన్నట్టు ధరణిలో చూపిస్తున్నది. పీఓటీ చట్టం ప్రకారం అసైన్డ్ భూమి కొన్న వ్యక్తి ఇతర భూముల్లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయ్యుండాలి. కానీ,17 ఎకరాల పట్టాభూమి ఉన్న రైతు నర్సయ్య కుటుంబానికి అసైన్డ్ భూములను ఎలా రీ అసైన్ చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నాటి ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూ ఆఫీసర్ల అండతో నర్సయ్య.. లావణి పట్టాలు పొందినట్టు తెలు స్తున్నది. ప్రస్తుతం ఒరిజినల్ అసైనీలు తక్కువ ధరకు కోల్పోయిన తమ భూముల కోసం మళ్లీ కలెక్టరేట్ మెట్లెక్కేందుకు రెడీ అవుతున్నరు.