- స్థలం కబ్జా చేశారని హౌసింగ్‌బోర్డు అధికారుల చర్యలు
- ఆలయ స్థలమే అంటున్న నిర్వాహకులు
కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్‌బీ కాలనీలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న మండపాన్ని హౌసింగ్‌బోర్డు అధికారులు ఆదివారం సీజ్ చేశారు. టెంపుల్స్‌తో పాటు ఇతరులు కబ్జా చేసిన బోర్డు స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు మండపాన్ని సీజ్ చేసినట్లు సమాచారం. అయితే, సీజ్ చేసిన స్థలం టెంపుల్‌కు సంబంధించినదని ఆలయ కమిటీ నిర్వాహకులు ఆరోపించారు. అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
గజం రూ. రెండు లక్షలు
జేఎన్టీయూ రోడ్డులో మలేషియా టౌన్షిప్ఎదురుగా కొండమీద వెలిసిన వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో మూడేండ్ల కిందట మండపాన్ని నిర్మించారు. ఇక్కడ పెండ్లిళ్లతో పాటు వివిధ శుభకార్యాలు జరుగుతున్నాయి. మండపం మూడు నుంచి నాలుగు వందల గజాల్లో ఉండగా చుట్టూ ఓపెన్ స్థలం కలిపి వెయ్యి గజాల వరకు ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం గజం విలువ లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు పలుకుతోంది. ఇది హౌసింగ్ బోర్డుకు సంబంధించినది కావడంతో స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.