సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ

సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ

హైదరాబాద్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్‎కు బహిరంగ క్షమాపణ చెప్పాడు. హీరో నాగచైతన్య, నటి శోభిత వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. నాగచైతన్య, శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని.. ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని గతంలో వేణు స్వామి చెప్పిన జోస్యం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కనీసం పెళ్లి కూడా కాకుండా విడాకులు తీసుకుంటారంటూ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్రంగా మండిపడ్డారు. 

వేణు స్వామి కామెంట్స్‎పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు మహిళా కమిషన్‎కు ఫిర్యాదు చేశారు. వేణుస్వామి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వేణు స్వామికి తెలంగాణ  ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మహిళా కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ వేణు స్వామి హైకోర్టు ఆశ్రయించారు.

 అయితే.. హైకోర్టులో వేణుస్వామికి ఎదురు దెబ్బ తగిలింది. ఉమెన్ కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణి స్వామికి రాష్ట్ర మహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో 2025, జనవరి 21న వేణుస్వామి మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. 

హైదరాబాద్‎లోని మహిళా కార్యాలయానికి వెళ్లి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ కు వేణుస్వామి బహిరంగా క్షమాపణ చెప్పడంతో పాటు.. నాగచైతన్య, శోభితాల వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపాడు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని ఈ సందర్భంగా వేణు స్వామిని మహిళా కమిషన్ హెచ్చరించింది.