నస్పూర్, మంచిర్యాల వెలుగు : నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి స్థలాల్లో పక్కా ఇండ్లు కట్టుకున్న అందరికీ పట్టాలు ఇప్పిస్తామని మంచిర్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ తెలిపారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో బీజేపీ మహారాష్ట్ర ఎమ్మెల్యే అశోక్ రాంజీ ఉకే, కర్ణాటక ఎమ్మెల్సీ కేశవ్ ప్రసాద్ మౌర్యతో కలిసి ఇంటింటికీ తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను రఘునాథ్ వివరించారు.
ఐదో వార్డు ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే దివాకర్ రావు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చి భూమి ఇవ్వకుండా కొక్కిరాల ప్రేమ్ సాగర్ మోసం చేశారని ఫైర్అయ్యారు. బీజేపీకి ఒక్క అవకాశమిస్తే పక్కా ఇండ్లు కట్టుకున్న అందరికీ పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సత్రం రమేశ్, జీవీ ఆనంద్, పనుగంటి మధు, ఈర్ల సదానందం, సామ్రాజ్ రమేశ్, రానవేణి శ్రీను, చక్రి, బద్రి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దండేపల్లి మండలంలోని మాదాపూర్, మ్యాదరిపేట గ్రామాల్లోని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు.
వారికి రఘునాథ్ బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ గారి పాలనకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, రాష్ట్రంలోనూ పార్టీని గెలిపిస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.