
నస్పూర్, వెలుగు: బీజేపీకి అవకాశం ఇస్తే ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రాఘునాథ్ చెప్పారు. ఆదివారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ నగర్, లక్ష్మి నగర్, గాంధీ నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. భూ అక్రమణాలు, అవినీతి లేని మున్సిపాలిటీగా నస్పూర్ ను తీర్చిదిద్దుతామన్నారు.
ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు కాలనీలోని 200 మందికిపైగా యువకులు, మహిళలు బీజేపీ పార్టీలో చేరారు. వారికి రఘునాథ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఈర్ల సదానందం, రమేశ్, బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి పాషా, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కొండ వెంకటేశ్, జిల్లా కార్యదర్శి రానవేణి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు, బీసీ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.