పంబన్​లో కొత్త ​బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

పంబన్​లో కొత్త ​బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
  • ఇది దేశంలోనే ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్‌‌‌‌ రైల్వే బ్రిడ్జి 
  • రూ.550 కోట్ల ఖర్చుతో సముద్రంపై 2 కి.మీ. మేర నిర్మాణం
  • రామేశ్వరం–తాంబరం ప్రత్యేక రైలుకూ పచ్చజెండా ఊపిన ప్రధాని
  • కార్యక్రమానికి హాజరు కాని తమిళనాడు సీఎం స్టాలిన్‌‌‌‌ 
  • సంతకమైనా తమిళంలో చేయండి.. డీఎంకే నేతలకు మోదీ చురకలు

చెన్నై: భారత ప్రధాన భూభాగాన్ని తమిళనాడులోని రామేశ్వరంతో కలుపుతూ కేంద్ర సర్కారు నిర్మించిన పంబన్​బ్రిడ్జిని ప్రధాని మోదీ ప్రారంభించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని, ఆదివారం దీన్ని జాతికి అంకితం చేశారు. దేశంలోనే ఇది మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సముద్ర వంతెన. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ బ్రిడ్జి కింది నుంచి ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్‌ లిఫ్ట్‌ ఉంటుంది. 

దీని నిర్మాణానికి దాదాపు రూ.550 కోట్లు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా రామేశ్వరం – తాంబరం ప్రత్యేక రైలును ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కొత్త బ్రిడ్జి మీదుగా ఈ రైలు పరుగులు పెట్టింది. ఇందులో స్టూడెంట్స్, ఇతర ప్రయాణికులు ప్రయాణించారు. అలాగే, పంబన్​బ్రిడ్జి కిందుగా ప్రయాణించిన కోస్ట్‌ గార్డ్‌ నౌకకూ మోదీ జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, తమిళనాడు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు పాల్గొనగా.. సీఎం స్టాలిన్ మాత్రం​హాజరుకాలేదు.

సంతకమైనా తమిళంలో చేయండి: మోదీ

భాషా వివాదం నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్​సహా ఆ రాష్ట్ర ఇతర నేతలకు ప్రధాని మోదీ చురకలంటించారు.  తనకు తమిళనాడు లీడర్లనుంచి అనేక లెటర్లు వస్తుంటాయని, అందులో ఒక్కదానిపై కూడా తమిళంలో సంతకం చేసి ఉండవని ఎద్దేవా చేశారు. నిజంగా తమ భాషను ప్రేమించేవారైతే కనీసం ఆ భాషలోనైనా సంతకం పెట్టండి  అని సూచించారు. పంబన్‌ బ్రిడ్జ్‌ ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడులో అధికార డీఎంకేపై విమర్శలు చేశారు. 

దశాబ్ద కాలంలో రాష్ట్ర రైల్వే బడ్జెట్ ఏడు రెట్లు పెరిగిందని, ఇంత గణనీయమైన వృద్ధి ఉన్నప్పటికీ కొంతమంది ఎలాంటి కారణం లేకుండా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మెడికల్​ కోర్సులను  తమిళ భాషలో అందించాలని, తద్వారా పేదలకు ప్రయోజనం చేకూరుతుందని తమిళ సర్కారుకు సూచించారు. గత పదేండ్లలో తమిళనాడులో 11 కొత్త మెడికల్​ కాలేజీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 

తమిళ భాష, తమిళ వారసత్వం ప్రపంచంలోని ప్రతి మూలకు చేరేలా కేంద్ర సర్కారు నిరంతరం కృషిచేస్తున్నదని చెప్పారు. పంబన్​ వంతెన గురించి మాట్లాడుతూ.. ఇది 21వ శతాబ్దంలోనే  ఇంజినీరింగ్‌ అద్భుతం అని అన్నారు. ప్రజల డిమాండ్​ మేరకు ఈ బ్రిడ్జిని నిర్మించామని, ఇది రవాణాపరంగానే కాకుండా ఉపాధి, ఆదాయ వృద్ధికి ఎంతో ఉపయోగపడనుందని చెప్పారు.

వంతెన విశేషాలు    

ఈ బ్రిడ్జిని రూ. 550 కోట్ల వ్యయంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్​వీఎన్​ఎల్​) నిర్మించింది. దీన్ని 110 ఏండ్ల పాత పంబన్​ వంతెన పక్కన నిర్మించారు.ఈ వంతెన 2.08 కిలోమీటర్ల పొడవు ఉంది. పాక్ జలసంధిపై నిర్మించిన ఈ బ్రిడ్జి రామేశ్వరం ద్వీపాన్ని భారత భూభాగం(మండపం)తో కలుపుతుంది.ఈ బ్రిడ్జిలో 72.5 మీటర్ల పొడవైన వర్టికల్ లిఫ్ట్ స్పాన్ ఉంది. దీంతో 17 మీటర్ల ఎత్తు వరకు ఎత్తొచ్చు. దీని కింది నుంచి నౌకలు సాఫీగా వెళ్లిపోవచ్చు. ఈ వంతెనపై రైళ్లు గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు
    
రెండు రైలు ట్రాక్‌లకు అనుగుణంగా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఒకే ట్రాక్‌ను కలిగి ఉన్నా.. భవిష్యత్తులో విస్తరింపజేయొచ్చు.  
ఈ వంతెన రామేశ్వరం ద్వీపానికి రైలు కనెక్టివిటీని పునరుద్ధరిస్తుంది. యాత్రికులు, పర్యాటకులు, వాణిజ్యానికి మెరుగైన సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది రామసేతుతో సంబంధం ఉన్న ప్రాంతంలో ఉండడం వల్ల సాంస్కృతిక ప్రాధాన్యతను కలిగి ఉంది.