
బిగ్‌బాస్ ఐదో సీజన్ నుంచి జెస్సీ (జశ్వంత్) హెల్త్ ఇష్యూస్‌తో ఎలిమినేట్ అయ్యాడు. అతను కొన్ని రోజులుగా ‘వర్టిగో’ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్య ఉన్నవాళ్లకి తల గిర్రున తిరిగినట్టు అనిపిస్తుంది. కళ్లు మసక కమ్ముతాయి. ఉన్నట్టుండి స్ప్రహ తప్పి కిందపడిపోతారు. ఈ సమస్య ఉన్నవాళ్ల ఆరోగ్యం ఎప్పుడు, ఎలా ఉంటుందో చెప్పలేం. ‘వర్టిగో’ ఎందుకు వస్తుంది? దీన్నుంచి ఎలా బయటపడాలో వివరించారు ఇఎన్‌టి స్పెషలిస్ట్ విష్ణుస్వరూప్ రెడ్డి.
వర్టిగో సమస్య ఉంటే తల తిరుగుతుంది. పరిసరాలు కూడా గిర్రున తిరిగినట్టు అనిపించడం, నడుస్తున్నప్పుడు తూలి పడడం, సరిగా నిలబడలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఈ సమస్యకి చెవి ఇన్ఫెక్షన్, మెదడు, గుండె సంబంధింత సమస్యలు కారణమవుతాయి. ఇరవై ఏండ్ల నుంచి ఎనభై ఏండ్ల వాళ్లలో కూడా వర్టిగో కనిపించే ఛాన్స్ ఉంది.
బిపిపి వర్టిగో
బినైల్ పారాక్సిసమల్ పొజిషనల్ వర్టిగో.. దీన్నే ‘పొజిషనల్ వర్టిగో’ అని కూడా అంటారు. చాలా మందికి తలకి దెబ్బతగిలిన తర్వాత వస్తుంది. వంగి బరువులు ఎత్తడం, ఎక్సర్సైజ్లు చేయడం, మెడ వ్యాయామాలు, తలని వంచి చేసే యోగాసనాలు కూడా ఈరకం వర్టిగో రిస్క్‌ని పెంచుతాయి. మెనియర్స్ డిసీజ్ (లోపలి చెవిలో వచ్చే డిజార్డర్), మైగ్రేన్ ఉన్నవాళ్లు పొజిషనల్ వర్టిగో బారిన పడే అవకాశం ఉంది. ఆపరేషన్ టైంలో ఎనస్తీషియా తీసుకుంటే పొజిషనల్ వర్టిగో వచ్చే ఛాన్స్ ఉంది. విటమిన్ బి–12 లోపం ఉన్నా, ఎనీమియా ఉన్నా కూడా తల తిరుగుతుంది. కొన్నిరకాల న్యూరలాజికల్ డిజార్డర్స్, సర్వైకల్ స్పాండిలైటిస్, గుండె సమస్యలు కూడా వర్టిగోకి కారణమవుతాయి.
లక్షణాలు
తల ఎత్తినా, తల దించినా లేదా బెడ్డు మీద ఒక పక్క నుంచి మరో పక్కకి తిరిగినప్పుడు, బెడ్డు మీద నుంచి లేచి కూర్చున్నప్పుడు తల తిరుగుతుంది. నడుస్తున్నప్పుడు తూలిపడతారు. అయితే ఈ లక్షణాలన్నీ కొన్ని సెకన్ల నుంచి రెండు నిమిషాలు ఉంటాయంతే. చెవిలో ఉన్న బ్యాలెన్స్ ఆర్గాన్లో క్యాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ ఉంటాయి. తల ఎత్తినప్పుడు, తల దించినప్పుడు ఈ క్రిస్టల్స్ చెవిలోని ఫ్లూయిడ్‌లో అటు ఇటు తిరుగుతుంటాయి. దాంతో తల తిరుగుతుంది. చాలావరకు ఒకచెవిలోనే ఇలా జరుగుతుంది. ఈ రకం వర్టిగోని పొజిషనల్ టెస్ట్ (‘డిక్స్ హాల్‌పైక్’ ) ద్వారా డయాగ్నోస్ చేస్తారు.
ట్రీట్మెంట్
ఈ వర్టిగోకి ఎపిలే పార్టికిల్ రీ–పొజిషనింగ్ మాన్యువర్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేస్తారు. పేషెంట్ తల 45 డిగ్రీల కోణంలో ఉండేలా పడుకోబెడతారు. తర్వాత పేషెంట్ తలని ఆపొజిట్ సైడ్‌కి తిప్పుతారు. పేషెంట్ తల నేలని చూసేంతవరకు అలా తిప్పుతారు. ఇలాచేయడం వల్ల క్యాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ చెవిలోని బ్యాలెన్స్ ఆర్గాన్లోకి వెళ్తాయి. దాంతో సమస్య తగ్గిపోతుంది.
వెస్టిబ్యులార్ న్యూరనైటిస్ వర్టిగో
చెవిలోపలి బ్యాలెన్స్ ఆర్గాన్‌కి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వర్టిగో వస్తుంది. ఇందులో రెండు రోజుల వరకూ తల తిరుగుతూనే ఉంటుంది. వాంతులు, తుమ్ములు కూడా వస్తాయి. వీళ్లకి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తారు. వాంతులు తగ్గడానికి ప్రోక్లోర్పారజైన్ అనే మందుని ఇంజెక్షన్ లేదా ట్యాబ్లెట్ (నాలుక కింద పెట్టుకోవాలి) ఇస్తారు. బీటా–హిస్టీన్ ట్యాబ్లెట్ వేసుకుంటే తలతిరగడం తగ్గుతుంది. నాలుగైదు వారాల్లో పూర్తిగా రికవరీ అవుతారు. అయితే ఇవన్నీ డాక్టర్ల సలహా మేరకే తీసుకోవాలి.
మెనియర్స్ డిసీజ్
లోపలి చెవిలో వచ్చే డిజార్డర్ ఇది. లోపలి చెవిలోని ఫ్లూయిడ్ మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దాంతో పది నిమిషాల నుంచి రెండు గంటల వరకు తల తిరుగుతుంది. వాంతులు, తుమ్ములతో పాటు చెమటలు కూడా పడతాయి. చెవిలో ‘గుయ్’మని సౌండ్ వస్తుంది. ఈ డిసీజ్‌ని ఎలక్ట్రోకొహ్లియోగ్రఫీ (ఎకోజి), వెంప్ టెస్ట్‌ల ద్వారా డయాగ్నోస్ చేస్తారు. ప్రోక్లోర్ పారజైన్, బీటా–హిస్టీన్ వాడితే తొందరగా కోలుకుంటారు. ఒకవేళ తీవ్రమైన లక్షణాలుంటే ఇంట్రాటింపానిక్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తారు. ఈ డిసీజ్ రాకూడదంటే స్మోకింగ్, ఆల్కహాల్ మానేయాలి. కెఫిన్ ఉన్న డ్రింక్స్ ఎక్కువ తాగొద్దు.
వెస్టిబ్యులర్ మైగ్రేన్
మైగ్రేన్ ఉన్నవాళ్లకి వర్టిగో వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని సార్లు మైగ్రేన్ లేనివాళ్లకి కూడా వర్టిగో రావొచ్చు. మైగ్రేన్ మందులతో పాటు బీటా హిస్టీన్ వంటివి వాడితే మైగ్రేన్ కారణంగా వచ్చే వర్టిగో తగ్గుతుంది.
డ్రగ్స్ వల్ల
కొందరికి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆటోటాక్సిక్ డ్రగ్స్ ఇస్తారు. వీటిని ఎక్కువ రోజులు ఇస్తే వర్టిగో రావొచ్చు. పేషెంట్స్ వినికిడి శక్తి కోల్పోయే ఛాన్స్ ఉంది. డైయురిటిక్ డ్రగ్స్ (డయాలసిస్ చేసుకునేవాళ్లు) వల్ల రెండు చెవులు దెబ్బతినే అవకాశం కూడా ఉంది.
చెవిలో సమస్య
లోపలి చెవిలో బ్యాలెన్స్ ఆర్గాన్ ఉంటుంది. మూడు సెమిసర్క్యులర్ కెనాల్స్, క్యాల్షియం కార్బోనేట్‌తో తయారైన రెండు ఆర్గాన్స్ ఉంటాయి. ఇక్కడే వెస్టిబ్యుల్ (బ్యాలెన్స్), కాక్లియె(వినికిడి)కి కారణమయ్యే రెండు సెన్సరీ నరాలు ఉంటాయి. ఈ రెండూ లోపలి చెవిలోంచి మెదడుకు కనెక్ట్ అవుతాయి. చెవి సమస్యల వల్ల వచ్చే వర్టిగోలో కాన్షియస్ కోల్పోవడం జరగదు. వర్టిగో వచ్చి కాన్షియస్ కోల్పోయారంటే మెదడు లేదా గుండెలో సమస్యలు కారణమని చెప్పొచ్చు.