చలిగాలులతో ఢిల్లీ గజగజ: జీరోకి పడిపోయిన విజిబిలిటీ..నగరమంతా మంచుదుప్పటి

  • వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
  • రైళ్లు, విమాన సర్వీసులు రద్దు

న్యూఢిల్లీ/శ్రీనగర్: దేశ రాజధాని ఢిల్లీ నగరం చలిగాలులతో గజగజ వణికిపోయింది. శుక్రవారం ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయి. దీనికితోడు చలిగాలులు కూడా వీచాయి. నగరమంతా దట్టమైన మంచుదుప్పటి ఏర్పడింది. విజిబిలిటీ సున్నా స్థాయికి పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది కలిగింది. శుక్రవారం ఢిల్లీలో చలిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు అంతకుముందే అలర్ట్  జారీ చేశారు.

ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ గా రికార్డయ్యాయి. జీరో విజిబిలిటీ కారణంగా రైళ్లు, విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దట్టమైన పొగమంచు కారణంగా సర్వీసులు రద్దు చేశామని ఢిల్లీ ఎయిర్ పోర్ట్  అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అప్ డేటెడ్  సమాచారం కోసం  ప్రయాణికులు వారి ఎయిర్ లైన్స్ ను సంప్రదించాలని సూచించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు.

అయితే, కేటగిరి 3 కంప్లయింట్  విమాన సర్వీసులు (జీరో విజిబిలిటీ ఉన్నా రాకపోకలు సాగించే సామర్థ్యం ఉన్న విమానాలు) యదాతథంగా నడిచాయని తెలిపారు. ఇక, నేషనల్  క్యాపిటల్  రీజియన్ లోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఆనంద్  విహార్  టెర్మినస్, హజ్రత్  నిజాముద్దీన్  వంటి ప్రధాన రైల్వే జంక్షన్లలో రైళ్ల రాకపోకలు కూడా జీరో విజిబిలిటీ కారణంగా నిలిచిపోయాయి. మరోవైపు, ఎయిర్  క్వాలిటీ కూడా ‘సివియర్’ కేటగిరిలోకి పడిపోయిందని పొల్యూషన్  కంట్రోల్  బోర్డు అధికారులు తెలిపారు.

కాశ్మీర్ లో మైనస్ డిగ్రీలకు టెంపరేచర్లు

కాశ్మీర్​లో శుక్రవారం టెంపరేచర్లు మైనస్  డిగ్రీలకు పడిపోయాయి. శ్రీనగర్ లో మైనస్ 4.3, స్కీయింగ్ కు ఫేమస్ గా పేరుపొందిన టూరిస్ట్  స్పాట్  గుల్మార్గ్ లో మైనస్ 8.1, పహల్ గామ్ లో మైనస్ 10, కాజీగుండ్ లో మైనస్ 7.6, కుప్వారాలో మైనస్ 5.6 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. టెంపరేచర్లు మైనస్  డిగ్రీలకు పడిపోయినా చాలా ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉందని, బాగా ఎండ కాసిందని ఐఎండీ అధికారులు తెలిపారు.

శనివారం నుంచి రాత్రిపూట ఎగువ ప్రాంతాల్లో తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం కాశ్మీర్  ‘చిల్లాయ్  కాలన్’ గుప్పిట ఉందని వెల్లడించారు. చిల్లాయ్  కాలన్  ఈనెల 30న ముగుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇక, రాజస్థాన్ లోని చాలా ప్రాంతాల్లోనూ చలి తీవ్రంగా ఉంది. కరౌలీలో 3.3 డిగ్రీలు, ఫతేహ్ పూర్ లో 3.4, దౌసాలో 4.3, సంగారియాలో 4.4, చురూలో 5.4, గంగానగర్ లో 5.6 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి.

ట్రక్కును ఢీకొని బస్ డ్రైవర్, కండక్టర్ మృతి

దట్టమైన పొగ మంచులో ట్రక్కును యూపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్ డ్రైవర్, కండక్టర్  చనిపోయారు. ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్  జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పడేలాలోని బాలియా–లక్నో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రక్కును బస్సు ఓవర్ టేక్  చేస్తుండగా యాక్సిడెంట్  జరిగింది.

బస్సులో డోర్  వద్ద నిల్చున్న కండక్టర్  కింద పడడంతో ఆయనపై నుంచి వెనుక వస్తున్న ట్రక్కు వెళ్లిపోవడంతో కండక్టర్  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బస్ డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. బాధితులను పోలీసులు హాస్పిటల్​కు తరలించగా.. డ్రైవర్  చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా, ఢిల్లీ లక్నో హైవేపై కూడా శుక్రవారం ఉదయం పలు వాహనాలు ఢీ కొన్నాయి. పొగమంచు కారణంగా ముందు వెళుతున్న వాహనాలు కనిపించక ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని వివరించారు.