న్యూఢిల్లీ: పొగమంచు ఢిల్లీని కప్పేసింది. దీంతో విజిబిలిటీ తగ్గిపోయి.. 100 కి పైగా విమానాలు, 20 కి పైగా రైళ్లు ఆలస్యంగా నడిచాయి. విజిబిలిటీ 200 మీటర్లకు పడిపోవడంతో శుక్రవారం ఉదయం 130 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం సూచించింది.
ఢిల్లీలో పొగమంచు, తక్కువ విజిబిలిటీ కారణంగా విమానాల షెడ్యూల్ లో మార్పులు ఉంటాయని, ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమానయాన సంస్థ తాజా అప్డేట్ను తెలుసుకొని రావాలని ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఢిల్లీ వైపు సుమారు 27 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం.. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) శుక్రవారం ఉదయం పూర్కేటగిరీలో 294 వద్ద ఉందని అధికారులు వెల్లడించారు.
జీఆర్ఏపీ 4 రద్దు..
గత సంవత్సరం దీపావళి తర్వాత ఢిల్లీ ఏక్యూఐ సివియర్ ప్లస్ కేటగిరీకి చేరింది. దీంతో అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జీఆర్ఏపీ) 4 ను విధించవలసి వచ్చింది. అప్పటి నుంచి ఢిల్లీలో జీఆర్ఏపీ 3, 4 దశలను విధించడం, రద్దు చేయడం జరుగుతోంది. గురువారం దట్టమైన పొగమంచు ఆవరించి, విజిబిలిటీ సున్నాకు తగ్గడంతో ప్రభుత్వం జీఆర్ఏపీ 4వ దశను తిరిగి విధించింది. అయితే, తేలికపాటి వర్షం ఈ ప్రాంతంలో గాలి నాణ్యతను మెరుగుపరిచింది. దాంతో ఒక రోజు తర్వాత దానిని ఉపసంహరించుకున్నారు. కాగా, శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచుతో చాలావరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.