రాష్ట్ర సమైక్యత వజ్రోత్సవంలో మినిస్టర్ కేటీఆర్
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు : తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సంక్షేమానికి ట్రేడ్ మార్క్ గా నిలుస్తోందని, దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో నిర్వహించిన రాష్ట్ర సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 1948, సెప్టెంబర్17న హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం 3 రోజులు వేడుకలు నిర్వహిస్తోందన్నారు.
మా తాత స్వాత్రంత్ర్య సమరయోధుడు..
మా తాత జోగినపల్లి కేశవరావుది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయన్ పల్లి మండలం కొదురుపాక గ్రామం. ఆయన స్వాత్రంత్ర సమరయోధుడు. నేను ఆయనకు మొదటి మనవణ్ని. ఆయన నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. చిన్నప్పుడు వేసవి సెలవులు వచ్చినప్పుడు మా తాత ఆయన అనుభవాలను నాకు చెబుతుండేవారని కేటీఆర్అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టడం హర్షణీయమని, సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా 17వేల పింఛన్లు అందజేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
అమిత్ షా రూ.10 వేల కోట్లు తేవాలి..
కేంద్ర హోం మినిస్టర్అమిత్ షా రాష్ట్రానికి ఉత్త చేతులతో వచ్చి మాటలు చెప్పి పోతున్నారన్నారు. అమిత్ షా రూ.10 వేల కోట్లు తెలంగాణ ఇవ్వాలని డిమాండ్చేశారు. మతపిచ్చి, వైషమ్యాల మాయలో పడితే తెలంగాణ వెనుకబడుతుందన్నారు.
జగిత్యాల రూరల్: తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ప్రైవేట్, ప్రభుత్వ స్కూల్, కాలేజీ స్టూడెంట్స్, అంగన్వాడీలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వసంత, కలెక్టర్ రవి, ఎస్పీ సింధు శర్మ, మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి, లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్, ఆర్డీఓ మాధురి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, ఎంపీపీలు, జెడ్పీటీసీ లు, కౌన్సిలర్ లు, ఏఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.
పెద్దపల్లి: జిల్లాలోని మూడు నియోజకవర్గ కేంద్రాల్లో తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్సంగీత ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గోదావరిఖని : సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ గోదావరిఖని కేంద్రంలోని గాంధీ చౌక్ నుంచి ప్రారంభమై జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వరకు సాగింది. ర్యాలీలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సీపీ చంద్రశేఖర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్, ఏసీపీలు గిరిప్రసాద్, బాలరాజు, మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, జడ్పీటీసీలు సంధ్యారాణి, నారాయణ, స్టూడెంట్లు, ఆఫీసర్లు, లీడర్లు పాల్గొన్నారు.
గంగాధర: మండలంలోని మధురానగర్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ గరిమా అగర్వాల్, చొప్పదండి నియోజకవర్గంలోని 6 మండలాల ఎంపీపీలు మధుకర్, వేణుగోపాల్, రవీందర్, కవిత, స్వర్ణలత-, విమల-, స్టూడెంట్లు, ప్రజలు పాల్గొన్నారు.
ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యలో రాష్ట్ర సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల,ధర్మపురి రోడ్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డును మొత్తం బ్లాక్ చేయడంతో బస్టాండ్ లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ర్యాలీలో మంత్రితోపాటు కలెక్టర్ గుగులోత్ రవి, ఎస్పీ సింధు శర్మ, డీఎస్పీ ప్రకాశ్, లీడర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.
కోరుట్ల: రాష్ట్ర సమైక్యత వజ్రోత్సవంలో భాగంగా కోరుట్లలోని కొత్త బస్టాండ్ నుంచి కాలేజీ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కె.విద్యాసాగర్ రావు, అడిషనల్ కలెక్టర్ లత నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్లు లావణ్య, సుజాత, డీఎస్పీ రవీంద్రరెడ్డి, తహసీల్దార్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు స్టూడెంట్లు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 17నే నిజమైన స్వాతంత్ర్యం
కరీంనగర్ సిటీ: సెప్టెంబర్ 17, 1948 దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుక సందర్భంగా కరీంనగర్ లోని అమరవీరుల స్తూపం నుంచి మంత్రి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో మాట్లాడారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానానికి నిజమైన స్వాతంత్య్రం లభించిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, జడ్పీ చైర్పర్సన్ విజయ, మేయర్ సునీల్ రావు, డిప్యూటి మేయర్ చల్ల స్వరాపారాణి, సీపీ సత్యనారాయణ, మాజీ ఎంఎల్ సీ. లక్ష్మణ్ రావు, ట్రైనీ కలెక్టర్ లెనిన్ , ఎంపీపీలు, లీడర్లు పాల్గొన్నారు.