శ్రీరామనవమి... హిందువులకు ముఖ్యమైన పండుగ... ఎందుకో తెలుసా..

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి  పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.  శ్రీ సీతారాముల కళ్యాణం కూడా  అదే రోజున  జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలుగు రాష్ట్రాల్లోను కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా.. దాదాపు ప్రతి వీధిలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే.  సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ, శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

శ్రీరామనవమి ఉత్సవం 

శ్రీరామనవమి  పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో  సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం, భద్రాచలం ( తెలంగాణలో) సీతారామకళ్యాణం,  (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు {క్రీ.పూ} శాలివాహన శకం 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.

  • "ర" అక్షరం ప్రాముఖ్యత : చారిత్రికంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు. .
  • ముఖ్యంగా రామాయణం, రామ నవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది."రవి" అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని "Amon Ra" లేదా "Ra" అనేవారు. లాటిన్ భాషలో కూడా "Ra" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. 
  • ‘రామ’ యనగా రమించుట అని అర్ధం. కావున ప్రజల హృదయాల్లో ఆ 'శ్రీరాముడు వెలుగొందుతూ ఉంటాటని పండితులు చెబుతున్నారు. 


ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.
దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
 సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడిగా  ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరేసరి...  శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మన లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట!

 అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట... అందుకే  శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు...

రామ రాజ్యం  ఎలా ఉండేదంటే...

దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది అలాంటది ఈ క్రోధినామ సంవత్సరములో ఏప్రిల్ 17న  వచ్చింది. 

భక్తలు ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు ఉంటారు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది .


ఉత్సవంలో విశేషాలు 

  • ఆలయ పండితులచే  సీతారాముల కల్యాణం నిర్వహించబడుతుంది.  ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
  • బెల్లం, మిరియాలు, నీరు  కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.
  • ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.
  • ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు. ఉపవాసం ఉండలేని వారు పరిమితమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. 
  • దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు.రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.
  • భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రివర్యులు తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వారే ముత్యాలను తీసుకుని వస్తాడు.
  • ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది.