బీహార్ లో రెండు కూటముల మధ్య హోరాహోరీ

గతంలో ఎన్నడూ లేని రాజకీయ పరిస్థితులు ఈసారి బీహార్‌‌లో నెలకొన్నాయి. పూర్తి భిన్నమైన రాజకీయ వాతావరణంలో బీహార్‌‌లో ప్రస్తుతం లోక్‌‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్​రాజకీయాల్లో జేడీయూ కీలకమైంది.  ఆ పార్టీకి ప్రధాన నాయకులైన జార్జి ఫెర్నాండెజ్‌‌, శరద్‌‌ యాదవ్‌‌ల శకం ముగియడంతో ఆరేళ్లుగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.  ప్రస్తుతం నితీశ్​కుమార్​ కేంద్రబిందువుగా మారారు.​ 2014లో ప్రధాని కేండిడేట్‌‌గా నరేంద్ర మోడీ పేరు తెర పైకి వచ్చేసరికి ఎన్డీయే కూటమికి నితీశ్ కుమార్ కటీఫ్ చెప్పారు. మోడీతో పొత్తు పెట్టుకుంటే బీహార్ లోని ముస్లిం వర్గాలు దూరం అవుతాయని నితీశ్ అప్పట్లో భావించి ఉండొచ్చు. ఎన్డీయే కూటమికి  జేడీ(యు) గుడ్ బై కొట్టినా బీజేపీ కంగారుపడలేదు. రాం విలాస్ పాశ్వాన్ నాయకత్వాన గల లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జేపీ), అలాగే ఉపేంద్ర కుష్వాహా ఆధ్వర్యంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ)లను ఎన్డీయేలోకి తీసుకుని జేడీ(యు) లోటును భర్తీ చేసుకుంది బీజేపీ.

2014 లో ముక్కోణపు పోటీ

2014 లోక్‌‌సభ ఎన్నికల నాటికి మోడీ ప్రభంజనం బీహార్‌‌లో కూడా వీచింది. రాష్ట్రంలోని  మొత్తం 40 లోక్‌‌సభ సెగ్మెంట్లలో 31 సెగ్మెంట్లను ఎన్డీయే గెలుచుకుంది. బీహార్ వరకు బీజేపీ కంటే తామే రాజకీయంగా పవర్‌‌ఫుల్ అని భావించే ఆర్జేడీ, జేడీ (యు)లకు ఈ ఫలితాలు మింగుడుపడలేదు. 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటడం మొదలైంది. అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ జైత్రయాత్ర కొనసాగింది. దీంతో  బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలని  జేడీ (యు), ఆర్జేడీ, కాంగ్రెస్ డిసైడ్ అయి ఒక కూటమిగా ఏర్పడి 2015 అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అయ్యాయి.  మరో వైపు మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ జేడీ ( యు) నుంచి బయటకు వచ్చి ‘హిందూస్థానీ ఆవామ్ మోర్చా (హెచ్ఏఎం)’ పేరుతో  కొత్త  పార్టీ ఏర్పాటు చేసుకుని ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. ఎన్నికల ప్రచారంలో నితీశ్ కుమార్‌‌కి వ్యతిరేకంగా ప్రధాని మోడీ చేసిన కామెంట్లు నెగెటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి. బీజేపీకి వ్యతిరేకంగా బీహార్  వరకు ఏర్పాటైన కూటమికి ముస్లింలు, బీసీ, ఈబీసీ కులాల మద్దతు లభించింది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆర్జేడీ, జేడీ (యు), కాంగ్రెస్ కూటమి 178 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. జేడీ(యు) 70 సీట్లు, ఆర్జేడీ 79 సీట్లు గెలుచుకున్నా, లాలూ కొడుకులిద్దరికీ కేబినెట్‌‌లో చోటు కల్పించే ఒప్పందంపై నితీశ్‌‌కుమార్‌‌ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే జేడీ (యు), ఆర్జేడీ పొత్తు రెండేళ్లకే  బెడిసికొట్టింది. లాలూ ప్రసాద్‌‌ కొడుకులపై సీబీఐ దాడులకు అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. బీజేపీ తన 53 సీట్లతో మద్దతు పలికేసరికి నితీశ్ కుమార్ మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరిపోయి, సీఎం సీటు నిలుపుకున్నారు.

ఎన్డీయే కూటమికి  ఆర్ఎస్ఎస్పీ గుడ్ బై

2019 లోక్‌‌సభ ఎన్నికల నాటికి ఎన్డీయేలో పరిస్థితులు మారిపోయాయి. ఉపేంద్ర కుష్వాహా నాయకత్వానగల ‘రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ)’, జితిన్ రామ్ మాంఝీ నాయకత్వాన గల ‘హిందూస్థానీ ఆవామ్ మోర్చా’ (హెచ్ఏఎం) ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చాయి. మల్లాల (జాలర్ల) కుల నాయకుడిగా చెప్పుకునే ముఖేశ్ సహాని ఆధ్వర్యంలోని ‘వికాస్ శీల్ ఇన్సాన్‌‌ పార్టీ (వీఐపీ)’ కూడా ఎన్డీయేతో తెగదెంపులు చేసుకుంది. ఈ పార్టీలన్నీ ఆ తర్వాత తేజస్వి యాదవ్ నాయకత్వాన గల ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిలో చేరిపోయాయి. ఆదివారం పోలింగ్‌‌ జరిగే ఎనిమిది నియోజకవర్గాల్లో యాదవులు, ముస్లింలు, మల్లాలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కేండిడేట్ల గెలుపోటములను నిర్ణయించడంలో ఈ కులాలు, వర్గాలే కీలక పాత్ర వహిస్తాయి.

రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు

ఈసారి బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీ (యు), ఎల్‌‌జేపీలతో కూడిన ఎన్డీయే కూటమికి, ఆర్జేడీ, కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్పీ, వీఐపీ, హెచ్ఏఎంలతోగల కూటమికి మధ్య  హోరాహోరీ పోటీ నెలకొంది. 2014 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో ఉండి ఇప్పుడు దానికి వ్యతిరేకమైన కూటమిలోకి మారిన పార్టీల పరిస్థితి ఎలా ఉంటుందనే  చర్చ మొదలైంది. ఆర్ఎల్ఎస్పీ కిందటిసారి లోక్‌‌సభ ఎన్నికల్లో మూడు నియోజకవర్గాలకు పోటీ చేసి మూడింటినీ గెలుచుకుంది.  మోడీ ప్రభంజనం వల్లనే ఉపేంద్ర కుష్వాహా పార్టీ (ఆర్‌‌ఎల్‌‌ఎస్పీ) మూడు సీట్లలో గెలవగలిగిందన్న వాదన వినిపిస్తోంది. ఈసారి ఆర్ఎల్ఎస్పీ సత్తా ఏమిటో
చూడాల్సి ఉంది.

కేంద్ర పథకాలను నమ్ముకున్న బీజేపీ

బీహార్‌‌లో మొదటినుంచి పెద్ద కులాలనే బీజేపీ నమ్ముకుంది. ఈసారి కూడా పెద్ద కులాలు తమ వైపే ఉంటాయన్న నమ్మకంతో ఉంది. అలాగే ఉజ్వల యోజన, పల్లెల్లో మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామీణ హౌసింగ్ స్కీం, అన్ని ఇళ్లకు కరెంటు సరఫరా వంటి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలపై బీజేపీ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఈ పథకాలు సక్సెస్ అయ్యాయన్న సమాచారం అందడంతో  కులాలకతీతంగా ప్రయోజనం పొందిన అన్ని వర్గాల ప్రజలు తమకే అండగా ఉంటారని బీజేపీ లెక్కలు వేసుకుంది.. ఏమైనా బీహార్‌‌లో 2014 నాటి పరిస్థితులు ప్రస్తుతం లేవు. ఎన్డీయేతో అమీతుమీ తేల్చుకోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి
సిద్ధంగా ఉంది.