ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు తన రిటైర్మెంట్ వార్తలపై స్పందించాడు. జట్టు విజయంలో తాను భాగమైనంత కాలం ఆటను కొనసాగిస్తానని ఈ తెలిపాడు. అదే సమయంలో మరో నాలుగైదేళ్ల పాటు జట్టుతో కొనసాగాలనే దీర్ఘకాలిక ఆలోచనలు లేవని మరో మాట పలికాడు.
భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో ఖవాజా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 5 టెస్టుల్లో 20.44 సగటుతో 184 పరుగులు చేశాడు. ఒక అర్ధ సెంచరీ మాత్రమే. ఈ ఐదు టెస్టుల్లో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో ఆరుసార్లు ఖవాజా.. భారత స్పీడ్ గన్ బుమ్రా బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. సొంతగడ్డపైనే విఫలమవ్వడంతో సౌత్‌పా రిటైర్మెంట్ వార్తలు గుప్పుమన్నాయి. దీనికి తోడు అతని వయస్సుని హేళన చేస్తూ ఆసీస్ జట్టులో వృద్ధాప్య క్రికెటర్ ఇతడేనని ఆ దేశ మీడియానే కోడై కూయటం కొసమెరుపు. ప్రస్తుతం ఖవాజా వయస్సు.. 38 ఏళ్లు.
అదొక్క సిరీస్..
రాబోయే నాలుగేళ్లలో ఆసీస్ జట్టులో అనేక మార్పులు జరగొచ్చని అని ఖవాజా తెలిపాడు. ఒక్కొక్కరిగా సీనియర్ ఆటగాళ్లు జట్టును వీడతారని అన్నాడు. తన విషయంలో మాత్రం ఆడగలిగినంత కాలం దేశం కోసం ఆడాలని తన కోరికను బయటపెట్టాడు. ఏదేమైనా ఈ ఏడాది చివరిలో ఇంగ్లండ్‌తో జరిగే యాషెస్ సిరీస్(2025/26) ఆస్ట్రేలియా జట్టులో భాగం కావాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు.
జనవరి 29 నుంచి శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో సౌత్‌పా తిరిగి ఫామ్‌లోకి రావాలనే కోరికతో ఉన్నాడు.