దేశ దిగ్గజ జర్నలిస్ట్​ .. నేడు కుల్​దీప్​ నయ్యర్​ జయంతి

దేశ దిగ్గజ జర్నలిస్ట్​ .. నేడు కుల్​దీప్​ నయ్యర్​ జయంతి

భారతీయ తొలితరం దిగ్గజ జర్నలిస్టుల్లో కులదీప్ నయ్యర్ అగ్రగణ్యుడు. రచయిత, కాలమిస్ట్, దౌత్యవేత్త, మానవ హక్కుల ఉద్యమకారుడైన ఆయన పాతతరం జర్నలిస్టుల్లో సుపరిచితుడు. కీ హోల్ జర్నలిజానికి ఆద్యుడు కూడా. ఒక గదిలో రహస్యంగా జరిగే చర్చల ( తాళం చెవి పెట్టే రంధ్రంలోంచి చూసినట్టుగా)పై లోపలి రాజకీయ విషయాలను ఎంతో నాటకీయతతో వర్ణించినట్టుగా రాసేవారు. త‌‌‌‌న అభిప్రాయాల‌‌‌‌ను నిర్మొహ‌‌‌‌మాటంగా చెప్పేవారు. నచ్చని విషయాలను నిర్భయంగా వ్యతిరేకించేవారు.

1966లో ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్​లో ఆనాటి మన దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్ట్రి ఆకస్మిక మరణవార్తను ప్రపంచానికి తెలియజెప్పిన తొలి వ్యక్తి కులదీప్ నయ్యర్.  మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో  సన్నిహితం కలిగిన ఆయన 1975లో దేశంలో విధించిన ఎమర్జెన్సీని తీవ్రంగా  వ్యతిరేకించాడు. ఆనాటి దేశ అంతర్గత భద్రతా చట్టం(మీసా) కింద జైలు శిక్ష కూడా అనుభవించాడు.  భారత్, పాకిస్తాన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొనాలని తపించేవారు.  పౌర విలువల విషయంలో రాజీపడేవారు కాదు. మొత్తంగా దేశంలో పత్రికా స్వేచ్ఛ కోసం నయ్యర్ సాహసవంతమైన జర్నలిస్టుగా ఎంతో కృషిచేశారు. ఆయన కన్నుమూసే దాకా కలం వీడలేదు. 

అవిభాజ్య ఇండియాలో పుట్టిన ఆయన..  

1923 ఆగస్టు 14న అవిభాజ్య భారత్​లోని పంజాబ్ (నేటి పాకిస్తాన్‌‌‌‌)లోని సియాల్‌‌‌‌ కోట్‌‌‌‌లో సిక్కుల కుటుంబంలో కులదీప్​ జన్మించారు. లా, జర్నలిజం డిగ్రీలు చదివిన నయ్యర్ ఉర్దూ జర్నలిస్టుగా తన కెరీర్‌‌‌‌ను ప్రారంభించాడు. ఆనాడు ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ‘ది స్టేట్స్ మన్’కు ఢిల్లీ ఎడిషన్​ ఎడిటర్ స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా దేశ విదేశాల్లోని ప్రముఖ పత్రికలకు కాలమ్స్ కూడా రాశారు. 

14 భాషల్లోని 80 వార్తా పత్రికల్లో ‘ ఆప్ -ఎడ్’ ( ఆపోజిట్ టు ద ఎడిటోరియల్) లో వ్యాసాలు రాశారు. ‘ద డైలీ స్టార్’, ‘ద సండే గార్డియన్’, ‘ ద న్యూస్ పాకిస్థాన్’, ‘ద స్టేట్స్‌‌‌‌మన్ (ఇండియా)’ ఎక్స్‌‌‌‌ ప్రెస్ ట్రిబూన్(పాకిస్తాన్)’,  డాన్ (పాకిస్తాన్)’  వంటి పత్రికలకు కాలమిస్ట్​గా సేవలందించారు. 1995 నుంచి ఇండియా, పాకిస్తాన్ బార్డర్​లోని వాఘాలో ఆగస్టు 14-– 15 అర్ధరాత్రి సమయంలో ఇరుదేశాల  శాంతి సామరస్యతకు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రెండు దేశాల ప్రజలను  స్మరించుకుంటూ కొవ్వొత్తులతో నిర్వహించే జాగరణ సంప్రదాయం ఆయనే ప్రారంభించాడు.   

పదవులకే వన్నె తెచ్చిన నయ్యర్​

నయ్యర్ తన జీవితంలో ఎన్నో పదవులను అలంకరించారు. పదవులకే వన్నె తెచ్చారు కూడా. 1990లో గ్రేట్ బ్రిటన్‌‌‌‌కు హైకమిషనర్‌‌‌‌గా పనిచేశారు. 1996లో ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి బృందంలో సభ్యుడిగా వెళ్లారు. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.  సిండికేట్ కాలమిస్ట్​గా ‘ బియాండ్ ది లైన్స్’  ‘ ఇండియా ఆఫ్టర్ నెహ్రూ’ వంటి 15 పుస్తకాలను రచించారు. 1971 భారత్, పాకిస్తాన్ యుద్ధంపై కథనాలు రాశారు. పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో,  బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుర్ రెహమాన్‌‌‌‌,  పాకిస్తాన్ అణుబాంబు పితామహుడు  ఏక్యూ ఖాన్‌‌‌‌ వంటి వ్యక్తులను కలిసి ఇంటర్వ్యూలు చేశారు. 

జర్నలిజానికి ఆయన చేసిన కృషికి 2015లో  ‘రామ్‌‌‌‌నాథ్ గోయెంకా లైఫ్‌‌‌‌టైమ్ అచీవ్‌‌‌‌మెంట్ అవార్డు’ వరించింది.  ‘ ఎమర్జెన్సీ రీ టోల్డ్’ పుస్తకంలో ఎమర్జెన్సీ విధించడానికి అసలు కారణాలను వివరించారు. ఉమ్మడి ఏపీలోని నాగార్జున యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా ప్రదానం చేసింది.  2018 ఆగస్టు 23న 95 ఏండ్ల వయసులో ఆయన ఢిల్లీలో కన్నుమూశారు.  2019లో పద్మ భూషణ్  పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అంకితమైన, నిబద్ధత కలిగిన జర్నలిస్టు నయ్యర్. ఆయన లేని లోటు పత్రికాలోకానికి తీరనిది.

ఓపెన్​ పేజీ డెస్క్