
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా (67) శనివారం ఢిల్లీ ఆస్పత్రిలో మృతి చెందారు. కరోనా సోకిన ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.భారత్ లోని టీవీ జర్నలిజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దువా..దూరదర్శన్,NDTV, ది వైర్ వంటి నేషనల్ మీడియా చానల్స్ లో ఎక్కువ కాలం పని చేశారు. వినోద్ మరణ వార్తను.. కుమార్తె మల్లిక దువా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఆయన అంత్యక్రియలను రేపు(ఆదివారం) లోధి శ్మశాన వాటికలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఢిల్లీలోని శరణార్ధుల కాలనీ నుండి జర్నలిస్టు స్థాయికి ఎదిగి...42 ఏళ్లకు పాత్రికేయ వృత్తిని చేపట్టి..అత్యున్నత శిఖరాలకు అధిరోహించారు వినోద్ దువా. జర్నలిజంలో ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2008లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
కరోనా సెకండ్ వేవ్‌లో వినోద్ దువా, ఆయన భార్య పద్మావతి దువా వైరస్ బారినపడ్డారు. ఇద్దరూ గురుగ్రాం ఆస్పత్రిలో చేరగా దీర్ఘకాలం కొవిడ్-19తో పోరాడుతూ పద్మావతి దువా ఈ ఏడాది జూన్‌లో కన్నుమూశారు.