ప్రముఖ మలయాళ నటుడు టిపి మాధవన్ ఈరోజు (అక్టోబర్ 9) కేరళలోని కొల్లంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. మాధవన్ పదేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. దీంతో ఇటీవలే అనారోగ్యం కారణంగా కొల్లంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్సలు తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. మాధవన్ మరణవార్త అభిమానులు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
అయితే మాధవన్ మరణవార్త తెలుసుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. దాదాపు 600 సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన ప్రతిభావంతుడు మాధవన్ అని అన్నారు.
ఈ విషయం ఇలా ఉండగా మాధవన్ దాదాపుగా 40 ఏళ్లపాటూ సినీ పరిశ్రమలో రాణించారు. 1975లో భీం సింగ్ దర్శకత్వం వహించిన రాగం అనే చిత్రం ద్వారా మాధవన్ సినీ కెరీర్ ని ఆరంభించాడు. ఈ క్రమంలో 600కి పైగా మలయాళ సినిమాల్లో నటించారు.
అంతేగాకుండా టెలివిజన్ సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. అలాగే కొంతకాలంపాటు మలయాళ సినీ నటుల సంఘం అమ్మ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. చివరిగా 2016లో విడుదలైన మాల్గుడి డేస్ అనే ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటించాడు.