ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్(59) ఇవాళ(శనివారం) ఉదయం కన్నుమూశారు. నిన్న(శుక్రవారం) ఉదయం 11 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడినట్లు డాక్టర్లు తెలిపారు. వివేక్ మరణంతో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి లోనైంది.
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ వెండితెరకు పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మనదిల్ ఉరుది వేండం’ అనే మూవీతో వివేక్ నటుడిగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత అనంతరం ఆయన హాస్యనటుడిగా దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. కోలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు రజనీకాంత్, సూర్య, అజిత్ చిత్రాల్లో వివేక్ హాస్యనటుడిగా మెప్పించారు. ‘శివాజీ’, ‘సింగం’, ‘సింగం-2’, ‘విశ్వాసం’ చిత్రాలతో వివేక్ తెలుగువారికి కూడా సుపరిచితులయ్యారు.