భద్రాద్రి జిల్లాలో పశు వైద్యులు, మందుల కొరతతో తిప్పలు

భద్రాచలం,వెలుగు: జిల్లాలో పశువులకు సరైన వైద్యం అందడం లేదు. అవసరం మేర వైద్యులు, స్టాఫ్​ లేకపోవడంతో పాటు దవాఖానల్లో మందులు ఉండడం లేదని జనాలు వాపోతున్నారు. సరైన వైద్యం అందక పశువులు చనిపోతున్నాయని అంటున్నారు. ఇలా దుమ్ముగూడెం మండలం నారాయణరావుపేట గ్రామంలో నెల రోజుల క్రితం లంపీ స్కిన్​ వైరస్​తో నాలుగు ఆవులు చనిపోయాయి. వ్యాక్సిన్​ అందించి ఉంటే అవి బతికేవని గ్రామస్తుడు కుర్రం ప్రశాంత్​ పేర్కొన్నాడు. ఇదే మండలం సిరిగుండం గ్రామంలో రోగాలతో పశువులు చనిపోతున్నాయని గొత్తికోయలు వాపోతున్నారు. అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో ఇటీవల ఓ ఆవు ప్రసవ వేదనతో చనిపోయింది. సకాలంలో వైద్యం అందించి ఉంటే ఆవు బతి కేదని బాధిత రైతు వాపోయాడు. ఇలా ప్రతీ రోజు జిల్లాలోని ఏదో ఒక చోట వైద్యం అందక పశువులు మృత్యువాత పడుతున్నాయి. మందులు, వైద్యులు, స్టాఫ్  కొరత కారణంగా ఈ పరిస్థితి ఉందని అంటున్నారు.

అరకొరగానే మందులు..

జిల్లాలో 2.83 లక్షల తెల్ల పశువులుంటే, 1.72 లక్షల గేదెలు ఉన్నాయి. 2.67 లక్షల గొర్రెలు, 2.57 లక్షల మేకలు, 11.76 లక్షల పెరటి కోళ్లు ఉన్నాయి. జిల్లాలోని పశు వైద్యశాలలకు ప్రభుత్వం ఏడాదికి నాలుగు సార్లు మందులను సప్లై చేస్తోంది. మూడు నెలలకోసారి వస్తున్న మందులు నెల రోజులకే అయిపోతున్నాయి. మిగిలిన రెండు నెలలు మందులు లేక ప్రైవేటు మెడికల్​ షాపులకు చీటీలు రాస్తున్నారు. గాజుగుడ్డ, సిరంజీలు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. కుక్కలకు సంబంధించిన మందులు, యాంటీ రేబిస్​ వ్యాక్సిన్, యాంటీ స్నేక్​ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండట్లేదు. ఏవైనా మేజర్​ ఆపరేషన్లు ఉంటే ఏపీలోని గన్నవరం, హైదరాబాద్​కు పంపుతున్నారు. పశువులకు బ్లడ్​ టెస్టులు, ఎముకలు, కాళ్లు విరిగితే ఎక్స్ రే చేసేందుకు సౌలతులు లేవు. ఆక్సిజన్ సిలిండర్లు కూడా దాతలు ఇచ్చినవే.  కనైన్​ పార్వో వైరస్​ ప్రబలితే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండటం లేదు. 

అన్నీ ఖాళీలే..

బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర పశు వైద్యశాలలో పని చేసే డాక్టరుకు దుమ్ముగూడెం, చర్ల, పాల్వంచ ఆసుపత్రుల ఇన్​చార్జీ బాధ్యతలు అప్పగించారు. బూర్గంపాడు ఏడీకి భద్రాచలం ప్రాంతీయ పశు వైద్యశాల బాధ్యతలు కూడా ఇచ్చారు. ఐదేళ్లుగా భద్రాచలం దవాఖానలో రెగ్యులర్​ ఏడీ లేరు. జిల్లాలో 30 వైద్యశాలలు ఉండగా, 13 డాక్టర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నారాయణపురం, నాగుపల్లి, పట్వారిగూడెం, చర్ల, సత్యనారాయణపురం, దుమ్ముగూడెం, కరకగూడెం, సారపాక, ఏడూళ్లబయ్యారం, బోడు, ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడులలో డాక్టర్లు లేరు. మూడు జూనియర్​ వెటర్నరీ ఆఫీసర్​ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. 44 పశు వైద్య ఉపకేంద్రాలు ఉంటే 13 బీఎల్​ పోస్టులు నేటికీ భర్తీకి నోచుకోలేదు. 24 లైవ్​స్టాక్ అసిస్టెంట్​ పోస్టులకు 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దమ్మపేట, జగ్గారం, నాచారాం, అశ్వారావుపేట, నారవారిగూడెం, చండ్రుగొండ, మద్దుకూరు, అన్నపురెడ్డిపల్లి, ముత్యాలంపాడు, కొమరారంలలో లైవ్​ స్టాక్​ అసిస్టెంట్లు లేరు. ప్రభుత్వం 317 జీవో ద్వారా సిబ్బందిని ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. వారి స్థానంలో ఇతర జిల్లాల నుంచి జిల్లాకు తెప్పించలేదు. ఇలా ఏండ్ల తరబడి జిల్లాలో పశు వైద్య సిబ్బంది కొరత 
ఉంది. 

త్వరలో పోస్టుల భర్తీ..

జిల్లాలోని పశు వైద్యశాలల్లో సిబ్బంది కొరత ఉంది. డిప్యుటేషన్లతో నెట్టుకొస్తున్నాం. సిబ్బందిని త్వరలో భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్లు కూడా ఇచ్చింది. పాడి పశువులకు సంబంధించిన మందులు సరిపడా వస్తున్నాయి. –పురంధర్, జిల్లా పశు సంవర్ధక అధికారి, భద్రాద్రికొత్తగూడెం

పాము, తేలు కరిస్తే తిప్పలే..

పశువులకు పాములు, తేలు కరిస్తే దవాఖానాల్లో మందులు ఉండడం లేదు. కుక్కలకు సంబంధించిన మందులు ఉంటలేవు. యానిమల్​ బర్త్ కంట్రోల్​ సెంటర్​ను భద్రాచలంలో ఏర్పాటు చేయాలి. బ్లడ్ టెస్టులు, ఎక్స్​రే వంటి సౌలతులు కల్పించాలి. –ఉదయ్​కుమార్, భద్రాచలం