
- అందుబాటులో లేని మందులు, వెటర్నరీ డాక్టర్లు
- వనపర్తి, గద్వాల జిల్లాల్లో38 పోస్టులకు 12 మందే
- 28 లైవ్ స్టాక్ అసిస్టెంట్లకు 18 పోస్టులు ఖాళీ
- లంపీ స్కిన్‌తో ఇప్పటికే 20 పశువులు మృత్యువాత
వనపర్తి, వెలుగు: పాడిరంగాన్ని సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. పశువులకు రోగాలు సోకి మృత్యువాత పడుతున్నా వైద్యం అందించడం లేదు. పశువైద్య శాలల్లో సరిపడా వెటర్నరీ డాక్టర్లను నియమించకపోవడమే కాదు అవసరమైన మందులు కూడా సరఫరా చేయడం లేదు. ఉన్న డాక్టర్లను కూడా డిప్యూటేషన్లపై పంపిస్తోంది. గాయాలు, ఎలర్జీలకు మినహా ఇతర మందులు అందుబాటులో లేకపోవడంతో పశువుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ యేడు వనపర్తి, గద్వాల జిల్లాల్లో పశువులకు లంపీ స్కిన్ వ్యాధి సోకి.. పదుల సంఖ్యలో మృతి చెందాయి.
సగానికి పైగా పోస్టులు ఖాళీ
వనపర్తి జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో పశువైద్య శాలలు, 50 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 19 మంది డాక్టర్లు పనిచేయాల్సి ఉండగా కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. లైవ్ స్టాక్ అసిస్టెంట్లు 17 మంది పనిచేయాల్సి ఉండగా ఆరుగురు, 18 వెటర్నరీ అసిస్టెంట్లకు గాను 17 మంది, గద్వాల జిల్లాలో 19 మంది వెటర్నరీ డాక్టర్లకు ఆరుగురు, బీఎల్‌ఏలు ఆరుగురికి ఐదుగురు, ఏడుగురు -జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లకు గాను ఆరుగురు, 11 లైవ్ స్టాక్ అసిస్టెంట్లకు నలుగురు, 17 వెటర్నరీ అసిస్టెంట్లకు 16 మంది పనిచేస్తున్నారు. దీంతో పశువులకు సరైన వైద్యం అందడం లేదు. వనపర్తిలో గాలి కుంటు వ్యాధి , నీలి నాలుక వ్యాధితో పాటు ఇతర సీజనల్ వ్యాధులకు మొదటి దశలో 18 లక్షల టీకాలు, రెండో దశలో 14 లక్షల టీకాలు ఇచ్చామని అధికారులు చెబుతున్నా.. రోగాలు మాత్రం తగ్గడం లేదు.
ఇబ్బందిగా మారిన డిప్యూటేషన్లు
వనపర్తి జిల్లా వెటర్నరీ హెల్త్ ఆఫీసర్‌గా మధుసూదన్ రావు బాధ్యతలు స్వీకరించిన కొద్ది కాలానికే డిప్యూటేషన్ పై మరో చోటికి వెళ్లిపోయారు. అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటనారాయణ కూడా అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో డిప్యూటేషన్ పై అలంపూర్ వెళ్లారు. ఖిల్లా ఘనపురంలో పనిచేస్తున్న డాక్టర్ ను సైతం జహీరాబాద్ కు పంపించారు. ఓ వైపు వైద్యం అందక పశువులు మృతి చెందుతుంటే.. ఆఫీసర్లు ఇక్కడ జీతం తీసుకుంటూ మరో చోట పనిచేయడంపై పాడిరైతులు మండిపడుతున్నారు.
పశువుల ప్రాణం తీస్తున్న లంపీ స్కిన్
లంపీ స్కిన్ వ్యాధి రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వ్యాధి సోకిన పశువుల శరీరం గడ్డలు కట్టి చర్మంపై రంధ్రాలు పడుతున్నాయి. ఆ తర్వాత తీవ్ర జ్వరంతో 10, 15 రోజులు ఇబ్బంది పడి మేత మేయక చనిపోతున్నాయి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామానికి చెందిన చిన్న బండలయ్యకు చెందిన లేగ దూడ ఈ వ్యాధి సోకి గురువారం చనిపోయింది. వెల్టూరు, పెద్దమందడి, అమ్మపల్లి గ్రామాలలో ఇటీవలే మరో మూడు పశువులు చనిపోయాయి. ఇప్పటి వరకు చాలా పశువులు చనిపోయినా అధికారులు మాత్రం వనపర్తిలో 10, గద్వాల10 పశువులు మాత్రమే చనిపోయాయని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోని సంతలకు తీసుకొస్తున్న పశువుల ద్వారా లంపీ స్కిన్ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించినా.. నియంత్రణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
మందులు లేవంటున్నరు
పశువులు రెండేళ్లుగా లంపీ స్కిన్ వ్యాధి బారిన పడుతున్నాయి. మూడేళ్లలోపు పశువులైతే కోలుకోలేక చనిపోతున్నయి. మందుల కోసం పశువుల దవాఖానాకు పోతే లేవంటున్నరు. డాక్టర్లు గూడ ఉంటలేరు. వ్యాధి సోకక ముందే టీకాలు ఇయ్యాలంట. వచ్చాక ఎన్ని మందులు వేసిన వట్టిదే అంటున్నరు.
- చిన్న బండలయ్య, అమ్మపల్లి, పెద్దమందడి మండలం
ఖాళీలు భర్తీ చేయాలని కోరినం
పశువైద్య శాలల్లో వెటర్నరీ డాక్టర్లు, ఇతర పోస్టులను భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు లెటర్ పెట్టినం. లంపీ స్కిన్ వ్యాధికి సంబంధించి గతేడాది వ్యాక్సిన్ అందజేశారు. ఈ ఏడాది మాత్రం వ్యాక్సిన్ ఇవ్వలేకపోయినం. ఈ వ్యాధిపై రైతులను ఇప్పటికే అప్రమత్తం చేసినం.
- వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా వెటర్నరీ ఇన్‌చార్జి ఆఫీసర్ , వనపర్తి