కామారెడ్డి జిల్లాలో బర్డ్​ఫ్లూ బార్డర్ దాటి రావొద్దు

కామారెడ్డి జిల్లాలో బర్డ్​ఫ్లూ బార్డర్ దాటి రావొద్దు
  • పౌల్ట్రీ రైతులు, సిబ్బందికి డాక్టర్లతో అవగాహన
  • కామారెడ్డి జిల్లాలో బర్డ్‌ ఫ్లూ వైరస్ ప్రబలకుండా ముందస్తు చర్యలు 
  • పౌల్ట్రీల్లోని కోళ్లను పరిశీలిస్తున్న వెటర్నరీ డాక్టర్స్​ టీమ్​
  •  మహారాష్ట్ర బార్డర్​లో చెక్​పోస్టు ఏర్పాటు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో బర్డ్​ప్లూ ప్రబలకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది.  మహారాష్ట్ర, ఛత్తీస్‌ గఢ్ రాష్ట్రాల్లో బర్డ్​ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం నివారణ చర్యలపై దృష్టి సారించింది.  పౌల్ర్టీ రైతులకు, వెటర్నరీ డాక్టర్లు, సిబ్బందిపై వ్యాధులు, నివారణపై అవేర్​నెస్​ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లాలో 304 పౌల్ర్టీలు ఉండగా ఇందులో 41 లేయర్ కోళ్ల ఫారాలు, 263 బాయిలర్​ పౌల్ర్టీలు ఉన్నాయి. వీటిలో14 లక్షల కోళ్లు ఉన్నాయి. భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, పాల్వంచ, రామారెడ్డి, రాజంపేట మండలాల్లో పెద్ద పౌల్ర్టీ ఫారాలు ఉండగా మిగతా మండలాల్లో చిన్నవి ఉన్నాయి.  

ఇటీవల మహారాష్ర్ట, ఛత్తీస్ గఢ్ స్టేట్స్‌లో  కోళ్లకు బర్డ్​ ప్లూ వ్యాపించినట్లు వెటర్నరీ అధికారులు తెలిపారు.  అక్కడి నుంచి  వైరస్​ రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని వెటర్నరీ ఉన్నతాధికారులు ఇక్కడి ఆఫీసర్లకు సూచించారు.  జిల్లాలో 3 రోజుల క్రితం రైతులు, వెటర్నరీ డాక్టర్లు, సిబ్బందికి అవేర్​నెస్​ ప్రోగ్రాం ఏర్పాటు చేయగా.. కలెక్టర్​ ఆశిష్​సంగ్వాన్​ వారికి పలు సూచనలు చేశారు. మహారాష్ర్ట బార్డర్​లో చెక్​పోస్టు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

పౌల్ర్టీల పరిశీలనకు టీమ్స్​

పౌల్ర్టీ ఫారాలను పరిశీలించేందుకు వెటర్నరీ శాఖ టీమ్స్​ను ఏర్పాటు చేసింది.  వెటర్నరీ డాక్టర్​, సిబ్బంది వెళ్లి తమ పరిధిలోని పౌల్ర్టీలను పరిశీలిస్తున్నారు.  కోళ్లకు వైరస్​ సోకిందా లేదా అనే వివరాలు సేకరిస్తున్నారు.  వైరస్​ రాకుండా షెడ్ల వద్ద తీసుకోవాల్సిన  రక్షణ చర్యల గురించి వివరిస్తున్నారు. . ఒకవేళ కోళ్లు చనిపోతే  వాటిని దూరంగా పూడ్చి పెట్టాలని సూచిస్తున్నారు. చికెన్​ ఎక్కువగా అమ్మే టౌన్‌లలో తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా మున్సిపల్​అధికారులను అలర్టు చేశారు.  చికెన్​ వ్యర్థాలను నివాసాలకు దూరంగా పడేసేలా చూడాలని సూచించారు. 

చెక్​పోస్టు ఏర్పాటు

మహారాష్ర్ట నుంచి కోళ్ల వెహికిల్స్​రవాణా కాకుండా చూసేందుకు చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తున్నారు.  కామారెడ్డి జిల్లాకు బార్డర్​లో మహారాష్ట్రలోని నాందేడ్​ జిల్లా ఉంది.  మద్నూర్​ మండలం సలావత్​పూర్​ వద్ద వెటర్నరీ అధికారులు చెక్​ పోస్టు ఏర్పాటు చేయనున్నారు.   

వైరస్​ వ్యాపించకుండా చర్యలు 

కోళ్లకు వైరస్​ వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. మహారాష్ర్ట, ఛత్తీస్‌ గఢ్ లో వైరస్​తో కోళ్లు చనిపోతున్నాయి. ఇక్కడ అలాంటి పరిస్థితులు రాకుండా చూస్తున్నాం.  మన జిల్లాకు మహారాష్ర్ట బార్డర్​లో ఉన్న దృష్ట్యా  అక్కడి నుంచి కోళ్ల రవాణా కాకుండా చెక్​ పోస్టు ఏర్పాటు చేస్తాం. పౌల్ట్రీ రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.  - డాక్టర్​ సంజయ్​కుమార్​, వెటర్నరీ జిల్లా అధికారి